‘పీఎం సూర్య ఘర్‌’లో ముందుగానే లక్ష్యాలు చేరుకున్నాం

– 40వేల సోలార్‌ రూఫ్‌ టాప్‌ యూనిట్లకు అనుమతిస్తున్నాం
– నష్టాల్లో డిస్కంలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు
– సింగరేణకి బకాయిలు చెల్లించాలి
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: గృహ అవసరాల కోసం పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన ద్వారా సౌర విద్యుత్‌ అందించే కార్యక్రమం ద్వారా నిర్దేశించిన సమయం కన్నా ముందే లక్ష్యాలను చేరుకున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్షలాది కుటుంబాలు తమ ఇళ్లపై ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయని, ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసుకుని విక్రయించుకునే వీలు కలుగుతుందని చెప్పారు. పొలాల్లో సోలార్‌ పంప్‌ సెట్లు పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుం పథకం తీసుకొచ్చింది. దీంతో రైతులకు కావాల్సిన విద్యుత్తును రైతులే ఉత్పత్తి చేసుకోవచ్చునని, వారి ఆదాయం రెట్టింపు చేయాలనే సంకల్పంతో కనీస మద్దతు ధర భారీగా పెంచామని, యూరియా వంటి ఎరువుల ధరలు భారీగా పెరిగినా సబ్సిడీ ధరకే రైతులకు అందజేస్తున్నామని వివరించారు. తెలంగాణకు 450 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్స్‌ డీసెంట్రలైజ్డ్‌ పవర్‌ గ్రిడ్‌కు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ప్రతి ఇంటికీ సోలార్‌ రూఫ్‌ టాప్‌ యూనిట్లను కేటాయించాలని కేంద్ర న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి లేఖ రాశానుని, దీనికి స్పందనగా 40 వేల సోలార్‌ రూఫ్‌ టాప్‌ యూనిట్లను కేటాయిస్తున్నామని ఆయన సమాధానమిచ్చారని పేర్కొన్నారు. 20 వేల యూనిట్లను మొదటి విడతలో అమర్చుతామన్నారు. రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాటు చేయాల్సిన నాలుగు వేల మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును సంబంధించి మొదటి విడతలో భాగంగా రూ.12 వేల కోట్లతో నిర్మించిన పవర్‌ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2023లో జాతికి అంకితం చేశారని, రెండో విడతలో భాగంగా 3800 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎన్టీపీసీ చర్యలు చేపట్టిందని, ఇందులో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 80 శాతాన్ని తెలంగాణకే కేటాయింపులు చేస్తున్నామని వివరించారు. అయితే ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేయకుండా మూడో వంతు మాత్రమే కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపిందని, మొత్తం విద్యుత్‌ను కొనుగోలు చేయాలని కోరుతున్నానని కిషన్‌రెడ్డి తెలిపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయిందని, మరో 56 మెగావాట్లకు పైగా సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. రామగుండంలో 121 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంటు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో 9.8 శాతం మేర విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతోందంటూ 2030 నాటికి 33,773 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటుందన్నారు.

రాష్ట్రంలో పవర్‌ డిస్కంలు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి.. కేసీఆర్‌ హయాంలో వాటిని అప్పుల ఊబిలోకి నెట్టేయగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే దారిలో వాటిని ఇబ్బందులు పెడుతోందన్నారు. రూ.30 వేల కోట్ల మేర బకాయిలు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. మార్చిలో 17100 మెగావాట్ల డిమాండ్‌ రాష్ట్రంలో వచ్చిందని, ఇందుకు తగ్గ విద్యుత్‌ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇది పార్టీలకో, వ్యక్తులకో సంబంధించిన విషయం కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.42 వేల కోట్ల బకాయిలు పడిరది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాపాల కారణంగానే ఇవాళ ఈ దుస్థితి ఏర్పడిరది. సింగరేణి కార్మికులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటే రూ.42 వేల కోట్లు చెల్లించాలని ఆయన తెలిపారు. ఇందుకు కార్యాచరణ తీసుకొచ్చి అందుకు తగ్గట్టు ముందుకు వెళ్లాలి. రెండేళ్లపాటు మైనారిటీలకు అన్యాయం చేసి ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం ఇప్పుడు ఆ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. అజారుద్దీన్‌పై, మైనారిటీలపై ప్రేమ ఉంటే రెండేళ్లుగా ఎందుకు ఆ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగంతో ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *