– రైలు బోగీలో వంతెనపై ప్రయాణం
– ఈ వంతెనతో కశ్మీర్ లోయ మిగిలిన దేశంతో అనుసంధానం
-శ్రీనగర్-వైష్ణోదేవి కట్రా మధ్య నేటి నుంచి రాకపోకలు
– ఈ వంతెనతో కశ్మీర్ లోయ మిగిలిన దేశంతో అనుసంధానం
-శ్రీనగర్-వైష్ణోదేవి కట్రా మధ్య నేటి నుంచి రాకపోకలు
:ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్ తరవాత తొలిసారిగా కశ్మీర్‌కు వెళ్లిన ప్రధాని మోదీ జమ్ము కశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్ రైలు వంతెనను ప్రారంభించారు. జెండా ఊపి రైల్వే వంతెనపై రాకపోకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే బ్రిడ్జిపై పరుగులు తీసిన కోచ్‌లో ప్రధాని ప్రయాణించారు. ఆయన వెంట కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కాశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నిర్మాణంతో మనదేశం మరో అద్భుత కట్టడానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ సందర్భంగా ప్రధాని ఉదమ్‌పూర్.. శ్రీనగర్.. బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. రూ.46వేల కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు.
శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. దీంతో కశ్మీర్ దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే ద్వారా అనుసంధానమైంది. వంతెన కారణంగా ఈ మార్గం ప్రధానంగా పర్యాటరంగాన్ని మరింత ఆకర్షించనుంది. శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని వందలాది మంది యాత్రికులు దర్శిస్తుంటారు. ఈ రైల్వే వంతెన ప్రారంభంతో పర్యాటకరంగంగా మరింత పుంజుకోనుంది. ఈ చినాబ్ బ్రిడ్జి 1,315 మీటర్లు విస్తరించి ఉంది. కఠినమైన వాతావరణాన్ని కూడా ఈ వంతెన తట్టు-కోగలదు. ఈ ప్రాంతం భూకంపం జోన్ 5లో ఉంది. ఇంజనీర్లు అత్యంత అద్భుతంగా ప్రణాళికలు వేసి ఈ బ్రిడ్జిని నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు వీచినా ఈ వంతెనకు ఏం కాదు.
బలమైన గాలులు తట్టుకునే విధంగా నిర్మించారు. ఇక వంతెన నిర్మించడానికి దాదాపు 30,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ప్రస్తుతం ఇదే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలుస్తుంది. చీనాబ్ వంతెన నిర్మాణాన్ని 2002లో వాజ్‌పేయ్ హయాంలో ప్రారంభించగా 2022లో మోడీ హయాంలో పూర్తయ్యింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్ లా రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా చేపట్టి విజయవంతంగా ముగించారు. శనివారం నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైళ్లు పరిగెత్తనున్నాయి. ప్రధాని ప్రారంభించిన చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇది ఈఫిల్ టవర్ కంటే చాలా ఎత్తైంది. ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు మాత్రమే. కానీ, ఈ బ్రిడ్జి ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు. కటింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జిలో ఆసక్తికరమైన మరో ప్రత్యేకత ఏంటంటే బ్లాస్ట్ రెసిస్టంట్ స్టీలు, కాంక్రీట్‌తో తయారు కావడం. బాంబు దాడులను సైతం బ్రిడ్జి తట్టుకుని నిలబడగలదు.





