తల్లులూ.. పిల్లల పేరుతో మొక్క నాటండి

ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది
ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటండి
వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: వనమే మనం.. మనమే వనం అని పెద్దలు చెప్పారు.. వనాల్ని కాపాడుకోవాల్పిన బాధ్యత అందిరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వనమహోత్సవం- 2025 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రుద్రాక్ష మొక్కను నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు.  అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.. అలాగే అమ్మలు కూడా పిల్లల పేరుతో మొక్కను నాటండి.. అని రేవంత్‌ పిలుపునిచ్చారు. మీ పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందని, ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. మహిళలను ప్రోత్సహిస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళుతోంది.. సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించాం.. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు.. ఆర్టీసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశాం అని వివరించారు. హైటెక్‌ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు ఉండేచోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించామని, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాంమని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరండని పిలుపునిచ్చారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల రుణాలు అందించాంమని, అన్ని రంగాల్లో ఆడబిడ్డలను ముందు భాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్‌ రాబోతోందని, వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటాను అని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి. పీసీసీఎఫ్ డా. సువర్ణ, ఇతర అటవీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *