– ట్రంప్ వాణిజ్య సుంకాలపై లోక్‌సభలో పీయూష్ గోయల్
న్యూఢల్లీి, ప్రజాతంత్ర, జులై 31: దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆగస్టు 1 నుంచి భారత వస్తువులపై 25శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ఈ టారిఫ్ ప్రభావాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. గత కొన్ని నెలలుగా భారత్-అమెరికా దేశాలు సమతుల్య, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం రైతులు, చిన్న వ్యాపారులు, ఎంఎంఈలు వంటి వర్గాల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా భావిస్తోందని గోయల్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై అనూహ్యంగా భారీ టారిఫ్ బాంబు విసిరారు. భారత దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక వీటికి అదనంగా రష్యాతో వర్తకం చేస్తున్నందుకు భారత్‌పై ప్రత్యేకంగా జరిమానా కూడా విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆ మొత్తం ఎంతన్నది పేర్కొనలేదు. ఈ నిర్ణయాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. తన సోషల్ విూడియా హ్యాండిల్ ’ట్రూత్ సోషల్’లో బుధవారం ఈ మేరకు ఆయన పలు పోస్టులు పెట్టారు. అమెరికాతో భారత వర్తక విధానాలు, నిబంధనలను అత్యంత దారుణమైనవిగా అభివర్ణించారు. భారత్ మా మిత్ర దేశమే. కానీ వర్తక, వాణిజ్య సంబంధాల విషయంలో ఆ దేశంతో అంతా సజావుగా లేదు. అమెరికాపై ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అందుకే ఆ దేశంతో మేం భారీ స్థాయిలో వ్యాపారం చేయడం లేదు‘ అని రాసుకొచ్చారు. భారత్‌తో అమెరికాకు భారీ వర్తక లోటు ఉందని గుర్తు చేశారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకే అదనంగా జరిమానా విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘ఉక్రెయిన్‌లో జనహననం ఆగాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో యుద్ధానికి పాల్పడుతున్న రష్యాతో భారత్ భారీ వాణిజ్య సంబంధాలు నెరుపుతోంది‘ అంటూ ఆక్షేపించారు.




