– సిట్ ముందు హాజరైన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
– బీఆర్‌ఎస్‌పై ఆరోపణల్లో యూటర్న్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై28: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఐపీఎస్, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం యూటర్న్ తీసుకున్నారు. అప్పట్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌పై ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన నేడు సిట్ ముందు విచారణకు హాజరై ఫోన్ ట్యాపింగ్‌ను బీఆర్‌ఎస్ రాజకీయంగా వాడుకోలేదని మాట మార్చి ఆ పార్టీకి అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని, కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ప్రవీణ్ కుమార్ గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై పంజాగుట్టలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈసీ, డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే సిట్ అధికారులు విచారణకు పిలిచారు. దానిపై ప్రవీణ్ కుమార్ నుంచి సోమవారం వాంగ్మూలం తీసుకున్నారు. యాపిల్ మొబైల్‌కు అలర్ట్ మెసేజ్ రావడంతో గతంలో ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. అప్పటి ఫిర్యాదుపై వాంగ్మూలం ఇవ్వమంటే డార్క్ వెబ్‌సైట్‌లో టూల్స్ ఉపయోగించి ప్రైవేటు వ్యక్తులతో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, తన ఫోన్‌ను ట్యాపింగ్ చేయిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ను పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రవీణ్ కుమార్ స్టేట్‌మెంట్ ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగానా లేక అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చారా అనేది చర్చనీయాంశంగా మారింది.


