ప్ర‌జ‌లు బీఆర్ఎస్ వెంటే నిలిచారు

-కాంగ్రెస్ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం
– మ‌రో ప‌దిరోజుల పాటు గెలిచిన స‌ర్పంచ్‌ల‌తో భేటీలు
– బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌.

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13:  రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి, అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచ్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో పలు జిల్లాల నుంచి తరలివచ్చిన నూతన సర్పంచులు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వందలాదిగా తరలివచ్చిన సర్పంచులు, పార్టీ నేతలతో కేటీఆర్ నివాసం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని బలప్రయోగం చేసినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రజలు మాత్రం భారత రాష్ట్ర సమితి వెంటే నిలిచారని అన్నారు. మొదటి దశ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు భారీగా గెలవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చిన ప్రతి ఒక్కరి పోరాట పటిమను ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు పదుల సంఖ్యలో విజయం సాధించడం గమనార్హం. కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గెలిచిన సర్పంచులు కేటీఆర్‌ను కలిశారు. “స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇంత పెద్ద ఎత్తున మన సర్పంచ్‌లు గెలవడం.. కాంగ్రెస్ పాలన పట్ల ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతకు, బీఆర్ఎస్ పట్ల ఉన్న ప్రజా సానుకూలతకు నిదర్శనం,” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.  ఈరోజు నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల నుంచి వచ్చిన సర్పంచులు కేటీఆర్‌ను కలిశారు. రానున్న వారం, పది రోజుల పాటు కేటీఆర్ వరుసగా వివిధ జిల్లాల నుంచి వచ్చే నూతన సర్పంచులను కలుసుకోనున్నారు. వారిని సత్కరించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, వివిధ జిల్లాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *