ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ అజెండా

– విపక్షాల దుష్ప్రచారం
– నవీన్‌ యాదవ్‌ను గెలిపించండి
– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే ప్రభుత్వ అజెండా అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో లబ్ది పొందేందుకే బీఆర్‌ఎస్‌, బీజేపీ మాపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా శ్రీనగర్‌ కాలనీ, ఎల్లారెడ్డిగూడలోని పలు కాలనీల్లో ఆయన విస్తృతంగా శనివారం ప్రచారం నిర్వహించారు. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బీఆర్‌ఎస్‌ పాలనలో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు తీసుకున్న చర్యలను వోటర్లకు వివరించారు. మేం వేసే ప్రతి అడుగు భావితరాల భవిష్యత్తు, రాష్ట్రాభివృద్ధి కోసమేనని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్‌ తోనే సాధ్యమవుతుందని, ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ పాలనలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురయ్యిందన్నారు. చాలా కాలనీలు, బస్తీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని వోట్లు అడుగుతున్నారో నిలదీయాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నవీన్‌ యాదవ్‌ను ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ఇక్కడి ప్రజలు, నియోజకవర్గానికి మేలు జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిరంతరం రాష్ట్రాభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్‌ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి బీఆర్‌ఎస్‌, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని జూబ్లీహిల్స్‌ వోటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ డా.రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *