ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం

– చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని వివరించండి
– కాంగ్రెస్‌ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాకూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని, గత 22 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి దోహదపడతాయని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తన నివాసంలో రెహమత్‌ నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిలతో మంత్రి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ తన పదేళ్ల పాలనలో భవిష్యత్తులో కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఊహకు అందని రీతిలో విధ్వంసం సృష్టించిందని, అయినా ప్రజలపై భారం మోపకుండా రాష్ట్ర ఆర్ధిక స్దితిగతులను మెరుగుపరుచుకుంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ 22 నెలల్లోనే ప్రతి పౌరుని హృదయాలలో ఒక స్దానాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం సంపాదించుకుందని చెప్పారు. ఒక్క ఓటు ప్రజల జీవితాలను ఎలా మారుస్తుందో చెప్పడానికి ఈ 22 నెలల పాలనే నిదర్శనమన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూనే మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పధకాలను ఇంటింటికీ తిరిగి చేరవేయాలని డివిజన్‌ ఇన్‌చార్జిలకు సూచించారు. అభివృద్ది విషయానికి వస్తే ఉదాహరణకు రేషన్‌ కార్డుల విషయాన్ని ప్రస్తావిస్తూ గత పదేళ్లలో ఈఆర్‌ఎస్‌ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఒక్క కార్డు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. పేదల కన్నీళ్లు తుడవడానికి ఎల్లప్పుడూ ముందుండే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నియోజకవర్గం పరిధిలో 14వేల కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చిందని, సుమారు 8వేల మంది పేర్లను రేషన్‌ కార్డులలో జత చేశామని ఆయన వివరించారు. ప్రతి రేషన్‌ కార్డుపైనా మనిషికి ఆరు కేజీల ఉచిత సన్న బియ్యం ఇస్తున్నామని, నెలకు 23 వేల క్వింటాళ్ల బియ్యం పేదలకు అందిస్తున్నామని చెప్పారు. సమావేశంలో నకిరేకల్‌, ఆలేరు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, రోడ్‌ సేఫ్టీ అధారిటీ కార్పొరేషన్‌ చైౖర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *