మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 12: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దని, ఇచ్చిన మాటకు పార్టీ కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. బీసీల పట్ల బీఆర్‌ఎస్‌కకు చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అసలు ఆమె ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడంలేదని వ్యంగ్యంగా అన్నారు. బీఆర్‌ఎస్‌లో దెయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత వారి పేర్లు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నుంచి దెయ్యాలు పోయాయా? ఉన్నాయా చెప్పాలని నిలదీశారు. తాము బీసీ రిజర్వేషన్లు తెస్తే కవిత రంగులు పూసుకొని తీన్మార్ డ్యాన్సులు చేస్తోందని సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్ హయాంలో సామాజిక తెలంగాణ రాలేదన్న కవిత ఆ పార్టీకి రాజీనామా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రంగులు, వేషాలు మార్చినంత మాత్రాన పిల్లి పులి కాలేదని దెప్పిపొడిచారు. బీసీ రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు చేసినప్పుడు కవిత లిక్కర్ స్కాంలో ఊసలు లెక్కపెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టారని ప్రశ్నించారు. బీసీలపై బీజేపీ చిత్త శుద్ధి ఏమిటో తేలిపోయిందని విమర్శించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని తాము పదేపదే ఏఐసీసీ హైకమాండ్ వద్ద పట్టుబట్టామని, తమ కోరికను, రాహుల్‌గాంధీ ఆశయాన్ని నెరవేర్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు మహేష్‌కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు చాంపియన్ కాంగ్రెస్.. తమ హీరో రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్‌రెడ్డి, తాము ఆయన సైనికులమని స్పష్టం చేశారు.





