దేవుడి మాన్యాలు కబ్జా చేస్తే పీడీ యాక్టు

– అధికారుల‌కు ఆదేశాలు

– ఈ విషయంలో న్యాయపోరాటం జరగడంలేదు
– ఎండోమెంటు ప్లీడర్ల సమావేశంలో మంత్రి సురేఖ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: దేవాదాయ శాఖ భూములపై న్యాయపరంగా గట్టిగా పోరాడాలని ఎండోమెంట్‌ ప్లీడర్లకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. అసలు న్యాయ పోరాటం సరైన రీతిలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. సచివాలయంలోని తన పేషీలో ఎండోమెంటు ప్లీడర్ల సమావేశం శనివారం నిర్వహించి దేవాదాయ శాఖ భూముల అన్యాక్రాంతానికి సంబంధించి కేసుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఎండోమెంటు కేసుల విషయంలో న్యాయవాదులతో ప్రతి ఆరు నెలలకోసారి సమావేశం పెట్టి స్టేటస్‌ చెప్పాలని ఆమె అధికారులను ఆదేశించారు. దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు పెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఎండోమెంటు ప్లీడర్ల పనితీరుపై మంత్రి సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను దేవాదాయ శాఖ మంత్రి అయి రెండేళ్లు అయిందని, ఇప్పటికీ ఏయే కేసులు గెలిచామో తెలియడం లేదని మంత్రి స్పష్టం చేశారు. అసలు కేసుల విషయంలో అప్డేట్‌ కోసం అడిగితే డిపార్టుమెంటులో ఎవరూ చెప్పలేకపోవడం, న్యాయ విభాగం అప్‌డేట్‌ చేయకపోవడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఏ కేసుల మీద న్యాయ పోరాటం చేశారో… వాటిని పరిష్కరించడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయో మంత్రి సురేఖ న్యాయ వాదులను అడగ్గా వారు ఆ వివరాలను తెలిపారు. కేసుల్లో పురోగతికి సంబంధించిన అంశాలు, జడ్జిమెంట్‌ కాపీ ఎండోమెంటు శాఖ సెక్రటరీకి అందజేయాలని మంత్రి సూచించారు. ఎండోమెంటు ట్రిబ్యునల్‌ను అపాయింట్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్కియాలజీ డిపార్టుమెంటు దగ్గర వివరాలు సేకరించాలని, ఆ సమాచారాన్ని సాక్ష్యంగా తీసుకోవాలని సూచించారు. అందుకోసం ఒక నిపుణుల కమిటీ నియమించాలన్నారు. భూములకు సంబంధించిన అంశాలు, టెంపుల్‌ ఎంప్లాయీస్‌ సర్వీసు వ్యవహారాలు కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని మంత్రికి చెప్పగా అందుకు కావాల్సిన పనులు చేయాలన్నారు. ఎవరైనా సహకరించకపోతే సెక్రటరీ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎండోమెంటు చట్టం మీద అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని మంత్రి చెప్పారు. జిల్లాకో లీగల్‌ ఆఫీసుర్‌ను నియమించాలన్నారు. హైకోర్టుకు కూడా లైజన్‌ ఆఫీసర్‌ను నియమించాలని, ఈవోల నుంచి ఒకరు ఉండాలని న్యాయ విభాగ టీం సూచించగా మంత్రి అనుమతించారు. వెంటనే అందుకు సంబంధించిన ప్రతిపాదనలు తనకుి పంపాలని ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *