– పోర్టల్లో వివరాలు నమోదు చేస్తేనే జీతాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: తెలంగాణలో ఉద్యోగుల వేతనాల చెల్లింపుపై ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది కచ్చితంగా ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ (ఐఎఫ్ఎంఐఎస్)కు ఆధార్ లింక్ చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ అర్ధరాత్రి వరకు అందరూ ఆధార్ లింక్ చేయాలని స్పష్టం చేసింది. లేదంటే వేతనాలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. అన్ని శాఖల్లో కలిపి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. వీరందరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెల 10 వరకు ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ లో నమోదు చేయాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ నెల 16 వరకు సగం మంది వివరాలు కూడా నమోదు చేయలేదు. ఈ క్రమంలో వివరాలివ్వనివారి జీతాల బిల్లులు ఈ నెలలో ఆమోదించేది లేదని ఆర్థికశాఖ హెచ్చరించింది. ఉద్యోగుల సమగ్ర వివరాలన్నీ లేకపోవడంతో కొన్నిచోట్ల అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నాయి. కొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులు మానేసినా, అనధికారికంగా సుదీర్ఘ సెలవులో వెళ్లినా వారి పేర్లతో వేతనాలు డ్రా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేరు, ఆధార్, సెల్ నంబర్లతో పోల్చిచూస్తే ఎంత మంది ఉద్యోగులు ఉన్నారనే స్పష్టమైన వివరాలు అందుతాయని భావించి వివరాలు పంపాలని కోరగా పలు కార్యాలయాలు స్పందించడం లేదు. ఈ క్రమంలో మరోమారు ఆర్థిక శాఖ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





