– ఆమేరకు బడ్జెట్ రూపకల్పన
– తెలంగాణ రైజింగ్-2047 దిశగా అడుగులు
– 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
– గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.72 లక్షల కోట్ల పెట్టుబడులు
– హిల్ట్ పాలసీ ద్వారా పరిశ్రమల భూముల బదలాయింపు
– మూసీ నది ప్రక్షాళనకు పథకాల రచన చేపట్టాం
– ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరిక
– అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం
– తొలుత తెలుగులో ప్రసంగం ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామిగా ఉండేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. తెలంగాణ రైజింగ్-2047 దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమవగా తొలిసారి రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఆపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. తొలుత తన ప్రసంగాన్ని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ తెలుగులో ప్రారంభించడం విశేషం. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని, ఇందుకు రోడ్డు మ్యాప్ రూపొందించామని, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18లక్షలకు చేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీకి తెలంగాణ 4.99 శాతం అందిస్తోందని, ప్రపంచానికే దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని అన్నారు. ఏడాది కాలంలో సంక్షేమ ఫలితాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. రాష్ట్రాన్ని కోర్, ప్యూర్, రేర్‌గా విభజించామని, పట్టణాభివ ద్ధికి ‘క్యూర’ మోడల్ అనుసరిస్తున్నామని, వ్యవసాయరంగ అభివృద్ధి కి ‘రేర్’ నమూనా రూపొందించామని చెప్పారు. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించామని, ప్రజలకు భద్రత కల్పించేందుకు నాలుగు పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేశామని, హిల్ట్ పాలసీ ద్వారా పరిశ్రమల భూముల బదలాయింపు చేపట్టామని వివరించారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రణాళికలు రచిస్తున్నామని, తొలి దశలో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివ ద్ధి చేపడతామని చెప్పారు. మూసీలో మురుగు నీరు చేరకుండా 39 ఆర్‌వోబీలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఓఆర్ఆర్ మాదిరి రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయబోతున్నామని, పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలించాలని నిర్ణయించామని గవర్నర్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ చుట్టూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5 లక్షల 72 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌కు అనుబంధంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తామని, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపడతామని వివరించారు. బుల్లెట్ రైళ్లకు శంషాబాద్ కేంద్రంగా మారబోతోందని, వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్త ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయని గవర్నర్ వెల్లడించారు. ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు అందించామని, ఎస్‌హెచ్‌జీలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, కొడంగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోందని వెల్లడించారు. ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరాయన్నారు. ప్రజాపాలన`ప్రగతి ప్రణాళిక అమలుకు 99 రోజుల కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రజావాణికి వచ్చిన 64,697 పిటిషన్లలో 47,670 పరిష్కరించామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా అన్నారు. హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడామన్నారు. 23వ బయో ఆసియా సదస్సు ద్వారా రూ.1700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. జీసీసీలలో 20 శాతం ఆతిథ్యం ఇస్తూ హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్‌గా మారిందని, ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ కొనసాగుతోందని తెలిపారు. ఐటీ రంగం 9.39లక్షల ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు. గతేడాది వానాకాలంలో రైతు భరోసా కింద రూ.8,744 కోట్లు ఇచ్చామని, పంట రుణ మాఫీ కోసం రూ.20,616 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. సాగు నీటి రంగానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొత్తగా 15.12లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, 3.38 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని, మహాలక్క్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.9,222 కోట్లు ఆదా అయ్యాయని, ఎస్‌హెచ్‌జీలకు రూ.లక్ష కోట్ల రుణాలందించేందుకు చర్యలు చేపట్టామని గవర్నర్ వివరించారు. టీజీపీఎస్సీ, ఇతర నియామక బోర్డులను సంస్కరించామని, రికార్డు సమయంలో 67,763 ఉద్యోగాలను భర్తీ చేశామని, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కూడా చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





