-వందల మైళ్లు చొరబడి ఉగ్రస్థావరాలపై దాడి
-స్వదేశీ తయారీ ఆయుధాలతోనే బుద్ది చెప్పాం
– మన సాయుధ సంపత్తి సత్తాను గుర్తించిన ప్రపంచం
– ఆపరేషన్ సింధూర్ ముగియలేదు
– కాన్పూర్ సభలో ప్రధాని నరేంద్రమోదీ
ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ ఆయుధ శక్తిని యావత్ ప్రపంచం కళ్లారా చూసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను మన క్షిపణి వ్యవస్థలు ధ్వంసం చేశాయన్నారు. బ్రహ్మోస్ క్షిపణులు శత్రువులకు నిద్రలేని రాత్రులు మిగిల్చాయని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. శుక్రవారం ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ త్రివిధ దళాలను, ఆపరేషన్ సింధూర్‌ను ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన సోదరీమణుల కోపాన్ని ప్రపంచమంతా చూసిందని తెలిపారు. పాకిస్థాన్ లోపల వందల మైళ్ల లోపల వారి ఇళ్లల్లోకి చొరబడి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసామన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ గజగజలాడిందని దెబ్బతో పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా భారత సైన్యం పనితీరుపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. స్వదేశీ ఆయుధ సామర్థం, మేకిన్ ఇండియా శక్తిని ఇది ప్రపంచానికి చూపించింది. పాకిస్థాన్‌లో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రస్థావరాలను నాశనం చేశాం. భారత ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి శత్రువులను గడగడలాడించాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాన్పుర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఆయన అమేథీలోని ఏకే203 రైఫిల్ ఉత్పత్తి ప్రారంభమైందన్నారు.
భారత సైన్యం దాడులకు దిగివచ్చిన పాకిస్థాన్ యుద్ధాన్ని ముగించాలంటూ వేడుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అణ్వాయుధ బెదిరింపులకు భారత్ బయపడదని, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోదన్నారు. పాకిస్థాన్ కుట్రలు, కుతంత్రాలు ఇక పనిచేయవని స్పష్టం చేశారు. ప్రతి ఉగ్రదాడికి తగిన సమాధానం చెప్పడమే భారత్ సిద్ధాంతమన్నారు. అందుకు సమయం, అనుసరించే విధానాన్ని సాయుధ బలగాలే నిర్ణయిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రదాడులపై భారత్ ఎప్పుడూ తీవ్రంగా స్పందిస్తుందని.. సైన్యం సమయం, ప్రణాళికలు వేసుకుని దాడి చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక అణు బెదిరింపులకు భారత్ ఎప్పుడూ భయపడదని తెలిపారు. స్వచ్ఛమైన కాన్పూర్ శైలిలో చెప్పాలంటే శత్రువు ఎక్కడున్నా వాళ్ల అంతు చూస్తామని మోదీ హెచ్చరించారు. కేవలం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలనే ఆపరేషన్ సింధూర్‌లో ఉపయోగించినట్లు చెప్పారు.
ప్రపంచమంతా మేక్ ఇన్ ఇండియా శక్తిని మన దేశీయ ఆయుధాలను చూసిందన్నారు. ఇక మన బ్రహ్మోస్ క్షిపణులు శత్రు భూభాగంలోకి ప్రవేశించి లక్ష్యాలను గుర్తించి విధ్వంసం సృష్టించాయని వెల్లడించారు. రక్షణ రంగంలోని పెద్ద కంపెనీలన్నీ ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయని అమేథీకి సమీపంలోనే ఏకే-203 రైఫిల్ ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పారు. బ్రహ్మోస్ కొత్త చిరునామా ఉత్తరప్రదేశేనని మోడీ ప్రకటించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. ఈ కార్యక్రమంలో సిఎం యోగి ఆదిత్యానాథ్ తదితరులు పాల్గొన్నారు.





