సీఎం రేవంత్ రెడ్డికి పలువురి ధన్యవాదాలు
కరీంనగర్, ప్రజాతంత్ర, మే 30 : తెలంగాణకు చెందిన బాలీవుడ్ నటుడు పైడి జైరాజ్ పేరిట జాతీయస్థాయిలో అవార్డు (Paidi Jairaj awards) ప్రకటించి.. రాష్ట్ర ప్రభుత్వం తొలి అవార్డును దర్శకులు మణిరత్నంకు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సీనియర్ జర్నలిస్ట్,దర్శకులు రామ్మోహన్ నాయుడు, జైరాజ్ కుటుంబ సభ్యులు కాసారం రమేష్, కవి, రచయిత అన్నవరం దేవేందర్, కవి,వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి కె.లక్ష్మీ గౌతమ్ తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను పైడి జైరాజ్ పై రూపొందించిన “ది ఇండియన్ ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జైరాజ్” టేబుల్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా జైరాజ్ పేరిట జాతీయ అవార్డు, ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని చేసిన విన్నపాన్ని మన్నించారని, ఈ రోజు జైరాజ్ పేరిట అవార్డు నెలకొల్పడం అభినందనీయమని అన్నారు. ఈ అవార్డు కార్యక్రమానికి జైరాజ్ కుటుంబ సభ్యులను ఆహ్వానించి, వారి సమక్షంలో అవార్డు ప్రదానం చేయాలని కోరారు.
రవిచంద్ర కృషి అభినందనీయం
మరుగున పడిన కరీంనగర్ ముద్దుబిడ్డ పైడి జైరాజ్ జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చిన సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ పొన్నం రవిచంద్ర కృషి అభినందనీయం. 2005 నుంచి వివిధ పత్రికల్లో జైరాజ్ పై అనేక వ్యాసాలు రాసిన రవిచంద్ర.. 2018 లో పైడి జైరాజ్ పై డాక్యుమెంటరీ రూపొందించి 6 అంతర్జాతీయ అవార్డులు అందుకుని జైరాజ్ జీవిత చరిత్రను ప్రపంచానికి తెలియచేశారు. గత ఏడాది జైరాజ్ పై అద్భుతంగా టేబల్ బుక్ రూపొందించి ప్రజాబాహుళ్యంలోకి తీసుకురావడమే కాకుండా ఆయన పేరిట జాతీయ అవార్డు నెలకొలిపేలా కృషి చేసినందుకు ఆయనను పలువురు అభినందించారు.



