అస్తమిస్తున్న సూర్యున్ని
నుదుట కౌగిలించుకొని
ఆమె వాకిట్లోకొచ్చింది
భూమికి నారింజరంగు చల్లినట్లుంది
అరచేతిలో ఆ సాయంత్రాన్ని పట్టుకొని
తడిమట్టిపై సంధ్యవనంలోకి మరలి
బంగారు చారల ఆకాశం కింద
అతని వెనకాలే నిల్చుంది!
అతని కళ్ళల్లో సముద్రం కదిలింది
శబ్దాలకతీతమైన పడవపై
మసక వెన్నెలను తాగుతూ
ఆ కిటికీలోంచి ఆవలకు కనుమరుగైంది
ఆమె గుప్పిట్లోంచి వదలబడిన సాయంత్రం
నీటిపై కాంతి పురుగుల వారధైంది…
సిల్హౌట్ లో ఒక తైలవర్ణ చిత్రం రాలిపడింది!
– రఘు వగ్గు
నారింజ రంగు సాయంత్రాలు





