– పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక
– బీహార్ వ్యవహారంపై నేడూ అదే రభస
– ఉభయ సభలు వాయిదా
– అనుమానాల నివృత్తిపై భేటీకి ఈసీ సమ్మతి
న్యూదిల్లీి, ఆగస్టు 11: బీహార్‌లో(Bihar) ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahulgandhi) చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ ఎంపీలు పార్లమెంటు నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ర్యాలీ నిర్వహణకు సంబంధించి తమకు ఎలాంటి అధికారిక వినతి అందలేదని సీనియర్ పోలీస్ అధికారులు చెప్పారు. సంసద్ మార్గ్‌లో భారీగా పోలీసులు మోహరించి రహదారిని బ్లాక్ చేసి బారికేడ్లు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్రానికి, ఈసీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులతో ఎంపీలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతలో మహిళా ఎంపీలు, అఖిలేష్ యాదవ్ బ్యారికేడ్లు దూకే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ సహా పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. ఇదిలా ఉంటే ఆశ్చర్యకరంగా కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉండే శశిథరూర్ అనూహ్యంగా రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు పార్లమెంటు ఉభయ సభలు (both houses of Paliament) సోమవారం ప్రారంభం కాగానే బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆ పక్షాలు ఆందోళనకు దిగాయి. బీజేపీతో ఈసీ కుమ్మక్కయిందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. స్పీకర్ సముదాయించే ప్రయత్నం చేసినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పార్లమెంటు ఉభయ సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఈ క్రమంలో పార్లమెంటు నుంచి ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
ప్రతిపక్షాలతో భేటీకి ఈసీ అంగీకారం
కాగా, ఇలాంటి సమయంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. బిహార్ సమగ్ర సవరణ సర్వే సహా పలు అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈసీకి లేఖ రాశారు. ఇందుకు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం విపక్షాలతో భేటీకి అంగీకరించింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అపాయింట్‌మెంట్ ఇస్తూ ఎన్నికల సంఘం సెక్రటరీ అశ్వినీ కుమార్ మోహల్ ఆదివారం రాత్రి జైరాం రమేష్‌కు లేఖ రాశారు. ఎక్కువమంది పట్టే అవకాశం లేనందున కేవలం 30 మందికే అనుమతి ఇచ్చారు.





