మిస్ వరల్డ్ సంస్థ, ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న పోటీదారులు, అధికారులు, అవిశ్రాంతంగా శ్రమించిన బృందాలు, విభాగాలు సహాయకుల అసమానమైన అంకితభావం, సమన్వయంతో కృషి చేసిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమగ్ర కార్యాచరణ, సమన్వయంతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పారు.
మీ అందరి సహకారంతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చెప్పగలిగామని పేర్కొన్నారు. సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించే, తెలంగాణను ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా నిలిపే అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం సదా సమాయత్తంగా ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. ఇదే అంకిత భావంతో తెలంగాణ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. 2025 మిస్ వరల్డ్ విజేతకు మంత్రి జూపల్లి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.




