
‘ప్లీజ్ లైట్ ఆఫ్ చెయ్యొద్దు.’ అన్నాడు ఆ శోభనపు పెళ్ళికొడుకు.
‘నీకు సిగ్గులేదు’ అంది శోభనపు పెళ్ళికూతురు, పడాల్సినంత సిగ్గు పడకుండానే.
ఇద్దర్నీ ఆ గదిలో బంధించాక వాళ్ళు చాలా కబుర్లు పంచుకున్నారు, పాలూ పళ్ళూ కూడా. అబ్బాయి వయసు ఆత్రం- అమ్మాయి మీద వాలిపోయేలా నెట్టేస్తుంటే, కుదురుగా కూర్చోలేకపోయాడు. అమ్మాయి మాత్రం ఆత్రాన్ని అదుపులోపెట్టి, బెట్టు చూపిస్తోంది. తన నిగ్రహం అతనికి అనుగ్రహం చేసి కవ్విస్తోంది.
కన్నార్పకుండా చూస్తున్న అబ్బాయి తన పెదాల్ని దగ్గరగా ముద్దచేసి ముందుకు పెట్టి ముద్దుకోసం అభ్యర్థించాడు. అమ్మాయి కళ్ళు మూసుకుంది, సమ్మతిస్తూ. అబ్బాయి ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడా అక్కడా కాదు. అమ్మాయికి కూడా అర్థం కాలేదు. కంగారులో అలా పెట్టాడేమో అనుకుంది. మళ్ళీ అక్కడే పెట్టిన చోటే పెట్టాడు. బుగ్గమీదా కాదు, నుదిటిమీదా కాదు. పెదవిమీదా కాదు, ముక్కుమీదా కాదు. పై పెదవికీ ముక్కుకీ మధ్యలో కాస్త కుడి పక్కకి. ‘ఇదేం ముద్దురా నాయనా’ అనుకుంది అమ్మాయి. ‘మై ఫస్ట్ కిస్’ తన్మయత్వంతో అన్నాడు అబ్బాయి, యిష్టంగా.
అబ్బాయి గుండెమీద చెయ్యివేసి ఆపి ‘నాలో నీకు యేం నచ్చింది?’ రెప్పలార్పకుండా చూస్తూ అడిగింది అమ్మాయి. మళ్ళీ అబ్బాయి ముద్దు పెట్టబోతుంటే, ‘నోటితో చెప్పు’ అంది. ‘నోటితోనే’ అని, మళ్ళీ పెట్టిన చోటే ముద్దుపెట్టి కాదు, యేకంగా చప్పరించేశాడు. కాదు కాదు, కొరికేశాడు.
పెళ్ళికూతురు చనువుగా వొక్క దెబ్బవేసింది. ఆపై పెళ్ళికొడుకు వంక కోపంగా చూసి ‘తినేస్తావా?’ అంది, తలాడిస్తూ. మళ్ళీ ‘వుఫ్’ అని వూదుకుంది సుకుమారి. ‘సారీ’ అన్న పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చూస్తూ నోరువెల్లబెట్టాడు. అతనిలోని ఆనందం మొత్తం ఆవిరైపోయింది. కాని పెళ్ళికూతురు మాత్రం పెళ్ళికొడుకుని చూసి పడి పడి నవ్వుతోంది.
నవ్వి నవ్వి అమ్మాయి కళ్ళలో నీళ్ళు తిరిగితే, నవ్వకుండానే అబ్బాయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘పర్లేదు, ఐ లైక్ యిట్. ఈ నొప్పి బావుంది’ అంది పెళ్ళికూతురు, వోరగా చూస్తూ. పెళ్ళికొడుకు మాత్రం వులుకూ పలుకూ లేకుండా షాక్ కొట్టినట్టు అలానే వుండిపోయాడు. మళ్ళీ తెరలు తెరలుగా ముంచుకొస్తున్న నవ్వుని అదుపు చేసుకోలేని పెళ్ళికూతురు తన చేతిని ముందుకు చాచి వేలితో అతని పెదవుల్ని తుడిచి చూపించింది. నల్లని కాటుక రంగు.
‘ఇట్స్ గాన్’ అంది పెళ్ళికూతురు, నవ్వుతూ.
‘పోయిందే’ అన్నాడు పెళ్ళికొడుకు, యేడుస్తూ.
‘పు… పుట్టుమచ్చ?’ అన్నాడు పెళ్ళికొడుకు. తలడ్డంగా వూపింది పెళ్ళికూతురు. ‘పెట్టు మచ్చ!’ అంది. మూగగా చూస్తున్నవాణ్ణి చూసి ‘హేండ్‌కు పెట్టుకున్నట్టే, బ్యూటీ స్పాట్’ వింతేముంది అన్నట్టు భుజాలు యెగరేసింది పెళ్ళికూతురు. ‘ఇట్స్ ఆర్టిఫిషియల్’ అంది.
పెళ్ళికొడుకు కళ్ళలో నీళ్ళు చూసి ‘వాట్ హేపెండ్?’ అంది పెళ్ళికూతురు. పెళ్ళికొడుకు దిగ్గున లేచి ముఖం తిప్పుకున్నాడు. ‘యూ చీటర్’ అన్నాడు. ఆమాటతో పెళ్ళికూతురు హర్ట్ అయి కళ్ళలో నీళ్ళు తిప్పుకుంది.
‘నిన్ను మార్లిన్ మన్రో అనుకున్నా, ఎవా మెండస్ అనుకున్నా, జయప్రద, శ్రద్దా కపూర్, నయనతార… వీళ్ళ పక్కన నువ్వు…’ అబ్బాయి ఎమోషనలయి చెప్పబోతుంటే, ‘హలో, బ్యూటీ స్పాట్ కదా అని పెట్టుకున్నా’ అంది అమ్మాయి. ‘నువ్వు నచ్చిందే అందుకు’ అబ్బాయి. ‘అంటే యిప్పుడు నచ్చలేదా?’ అమ్మాయి. ‘నచ్చలేదు’ అబ్బాయి మాటతో వొక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అమ్మాయి యేడ్చింది. అబ్బాయి సారీ చెప్పాడు.
‘పోని నీ కోసం రోజూ పెట్టుకుంటాలే’ కళ్ళు తుడుచుకుంటూ అంది అమ్మాయి. అబ్బాయిని దగ్గరగా తీసుకుంటూ ‘కాని నీ పెదాలు నల్లగా చూడలేను’ గలగలమని నవ్వింది. సిగ్గుతో అమ్మాయి గుండెల్లో ముఖం దాచుకున్నాడు అబ్బాయి.
-బమ్మిడి జగదీశ్వరరావు





