– కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌లకు కొమ్ముకాస్తున్నారు
~బీజేపీ సభకు ముందుగా అనుమతి కోరినా నిరాకరణ
– మాంగటి గోపీనాథ్ మృతిపై విచారణ జరిపించాల్సిందే
– రేవంత్, కేటీఆర్ మధ్య గోపీనాథ్ ఆస్తుల వ్యవహారం
– మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు కొమ్ముకాయడం సిగ్గు చేటు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, బీజేఎల్పీ ఉప నాయకుడు పాయల శంకర్, గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు వేముల అశోక్, అధికార ప్రతినిధులు జె.సంగప్ప, సోలంకి శ్రీనివాస్, రితేష్ రాథోడ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడబలుక్కునే ఒకరికొకరు తిట్టుకుంటున్నారన్నారు. తాము ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో రద్దు చేస్తున్నారంటూ మీనాక్షిపురం(రహమత్ నగర్)లో శుక్రవారం సాయంత్రం సభకు అనుమతి కోసం ఈనెల 4న దరఖాస్తు చేసుకుంటే నిన్నటిదాకా దీనిపై స్పందించలేదు.. పొద్దున ఫోన్ చేసి అనుమతి ఇవ్వడం లేదని, వేరేచోట పెట్టుకోవాలని చెబుతున్నారన్నారు. తాము ఎక్కడ సభ పెట్టుకోవాలో కూడా వాళ్లే చెబుతున్నారంటే ఏమనాలి అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు మాత్రం ఎక్కడ అడిగితే అక్కడ మీటింగ్‌కు అనుమతి ఇస్తున్నారన్నారు. తమకు చివరి నిమిషంలో ఎక్కడైనా అనుమతి ఇచ్చినా నిబంధనలు పెడుతున్నారన్నారు. ఇదేం ద్వంద్వ వైఖరి అని నిలదీశారు. బీజేపీ సభలకు అనుమతిస్తే ఒక వర్గం ఓట్లు రావనే భయం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు పట్టుకుందన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లను బీజేపీ గెలుచుకోగా జూబ్లిహిల్స్‌లో బీజేపీ గెలవకూడదనే కుట్రతోనే తమ సభలకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. దొంగ సర్వేలతో పోటీలో బీజేపీ లేదంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. ప్రజల ఆలోచన మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు గుణపాఠం చెప్పాలని ఉందని, ఈ విషయం తెలిసే కాంగ్రెస్ పార్టీ ముస్లింల మెప్పు పొందేందుకు యత్నిస్తోందన్నారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ వర్సెస్ ఐఎంసీ(ఇండియన్ ముస్లిం కాంగ్రెస్) మధ్యే పోటీ ఉందన్నారు. హిందూ ఓటర్లంతా తమ సత్తా ఏమిటో కాంగ్రెస్‌కు రుచి చూపాలని కోరుతున్నానన్నారు. బీఆర్‌ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని, ఉప ఎన్నికలో ముందే చేతులెత్తేసిందని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్ గెలిచినట్లే.. అరాచకాలు, అక్రమాలకు తావిచ్చినట్లేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని చెబుతున్నారు.. దేశ జవాన్లను అవమానించేలా, హేళన చేసేలా మాట్లాడారన్నారు.
రేవంత్, కేటీఆర్‌ల మధ్య గోపీనాథ్ ఆస్తుల యవ్వారం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం విషయంలో ఆయన తల్లిని మానసిక క్షోభకు గురి చేశారని సంజయ్ ఆరోపించారు. నా కొడుకు మరణం ఒక మిస్టరీ అని స్వయానా ఆయన తల్లే చెబుతోందన్నారు. గోపీనాథ్ మరణంపై సమగ్ర విచారణ జరపాలని, కుటుంబ సభ్యుల, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్‌మెంట్లను రికార్డు చేయాలని డిమాండ్ చేశారు. తన తండ్రిని చూడటానికి రావొద్దంటూ బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించినట్లు గోపీనాథ్ కొడుకే ఆరోపించారన్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు.. ఎందుకంటే గోపీనాథ్ ఆస్తులపై రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ట్విట్టర్ టిల్లు మధ్య పంపకాల యవ్వారం ఉంది కనుకనే అని ఆరోపించారు. గోపీనాథ్ మరణం, ఆస్తుల వ్యవహారంపై విచారణ జరిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? గోపీనాథ్ మరణంపై స్వయానా తల్లి ఆరోపణలపై ఇంతవరకు కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదు? సీఎంకు నిజంగా సంబంధం లేదని భావిస్తే తక్షణమే గోపీనాథ్ మరణం, ఆస్తిపాస్తులపై సమగ్ర విచారణ జరిపించాలి అని నిలదీశారు. ప్రజలకు వాస్తవాలు అర్ధమయ్యాయి.. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో పరిస్థితులు మారిపోయాయి.. బీజేపీ గెలుపు తథ్యం అని జోస్యం చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





