– అణు వార్‌హెడ్ క్షిపణి పరీక్ష నిర్వహణ
వాషింగ్టన్, మార్చి 5: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా భారీ అణు సామర్థ్యం గల క్షిపణి పరీక్ష నిర్వహించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికా సైన్యం కాలిఫోర్నియా తీరంలో ఉన్న వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి శక్తిమంతమైన మినిట్‌మ్యాన్-3 ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ పరీక్షను అమెరికా సాధారణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిందని అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణి పరీక్ష సాంటా బార్బరా సమీపంలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి నిర్వహించారు. ఈ ప్రయోగంలో నిరాయుధ రాకెట్‌ను ఉపయోగించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ప్రయోగించిన క్షిపణి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మార్షల్ ఐస్ ల్యాండ్ సమీపంలోని లక్ష్యాన్ని కచ్చితంగా తాకినట్లు అమెరికా స్పేస్ ఫోర్స్ వెల్లడించింది. మినిట్‌మ్యాన్-3 క్షిపణి అమెరికా రక్షణ వ్యవస్థలో కీలక భాగమని అధికారులు తెలిపారు. ఈ క్షిపణి అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమాపై పడేసిన అణుబాంబుల కంటే 20 రెట్లు శక్తివంతమైన వార్‌హెడ్‌లను మోయగల క్షిపణి అని అధికారులు చెబుతున్నారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్ ప్రకారం.. ఈ పరీక్ష పూర్తిగా రక్షణాత్మక ప్రయోజనాల కోసం నిర్వహించిందని అధికారులు తెలిపారు. క్షిపణి వ్యవస్థ కచ్చితత్వం, ప్రభావం, సిద్ధంగా ఉండే చర్యలను పరీక్షించడం ప్రధాన లక్ష్యమని అధికారులు వివరించారు. అలాగే వివిధ మిషన్ ప్రొఫైల్స్ ద్వారా మినిట్‌మ్యాన్-3 వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికా భూమి ఆధారిత అణు దాడి వ్యవస్థ సిద్ధతను నిర్దారించుకోవడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ భద్రతా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో రక్షణ వ్యవస్థలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై దాడులు చేసిన నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్ష జరగడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఈ పరీక్షకు ఆ ఘటనలతో ప్రత్యక్ష సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


