ఇందిర‌మ్మ‌ రాజ్యం కాదు బుల్డోజ‌ర్ రాజ్యం

– మూసీ బ్యూటిఫికేష‌న్‌కాదు .. లూటిఫికేష‌న్‌
– విధ్వంసం లేకుండా మూసీని అభివృద్ధి చేయ‌వ‌చ్చు
– ప్రాజెక్టు పేరుతో పేద‌ల ఇళ్లు కూలిస్తే ఊరుకోం
– ఒక్క ఇల్లు కూల్చ‌కుండా నాగోల్ వ‌ద్ద అభివృద్ధి చేశాం
– మాది వికాసం.. కాంగ్రెస్‌ది విధ్వంసం
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి  5: ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పి బుల్డోజర్ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని కేటీఆర్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ మూసీ ప్రాజెక్టు కోసం బుల్డోజర్ మోడల్ ఎంచుకున్నది. విధ్వంసం, అరాచకం లేకుండా మూసీని అభివృద్ధి చేయవచ్చు. లక్షన్నర పేదల ఇండ్లు కూల్చి మూసీ అభివృద్ధి చేస్తామంటే ఒప్పుకోబోమ‌న్నారు. గతంలో ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీని నాగోల్ ప్రాంతంలో అభివృద్ధి చేశామ‌ని గుర్తుచేశారు. ఈ  ప్రాజెక్టు కోసం పేదల ఇల్లు కూలిస్తే బిఆర్ఎస్ కార్యకర్తలు బుల్లోజర్లకు అడ్డుగా నిలబడతారని హెచ్చ‌రించారు. వేల కోట్ల అవినీతి నిండిన కాంగ్రెస్ మూసీ ప్రాజెక్టు విధానాన్ని వ్యతిరేకిస్తున్నామ‌న్నారు. మూసీలో అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఎలాంటి విధ్వంసం లేకుండా, అరాచకం లేకుండా మూసీని అభివృద్ధి చేయవచ్చ‌న్నారు. ఒక్క ఇల్లు కూల్చే అవసరం లేనిది బిఆర్ఎస్ మోడల్ అయితే లక్షన్నర ఇండ్లను కూల్చే బుల్డోజర్ మోడల్ కాంగ్రెస్ ది అని మండిపడ్డారు. బీఆర్ఎస్ మోడల్ లో వికాసం ఉంటే కాంగ్రెస్ విధానాల్లో విధ్వంసం ఉన్నదన్నారు. మూసీ అభివృద్ధి పేరిట కాంగ్రెస్ చేస్తున్న అరాచకాన్ని ,అవినీతిని ఆపాలని, తమ అవినీతి సొమ్ముల కోసం లక్షల మంది పేదల ఇండ్లు పూలగొట్టే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ మోడల్ పరిపాలన ఆపాలని కేటీఆర్ హెచ్చరించారు. కేవలం తన అవినీతి కోసం, ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల సంపాదన కోసం లక్షన్నర మంది పేదల ఇళ్లను కూలగొడతామంటే ఊరుకోమని, హైదరాబాద్‌లోని ప్రతి ఒక్క బిఆర్ఎస్ నాయకుడు, కేసీఆర్ సైనికుడు కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతారన్నారు. గతంలో త‌మ‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐదున్నర కిలోమీటర్ల మేర ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా మూసీని నాగోల్ ప్రాంతంలో అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వానికి ఇదే మాట చెప్పడానికి మూసీలో అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో కలిసి పర్యటించారు. అక్కడ మూసీ ప్రాజెక్టు బాధిత కుటుంబాలతో మాట్లాడారు. తీవ్రమైన ఆవేదనలో, ఆందోళనలో ఉన్న వారిని కేటీఆర్ ఓదార్చారు, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల ముందు పేదలకు అండగా ఉంటామని, వారికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి వారిని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ప్రభుత్వం ఎప్పుడు తమ ఇళ్లను కూలగొడుతుందో అని ప్రజలు భయం భయంగా బతుకుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట హైదరాబాద్ నగరంలో సృష్టిస్తున్న విధ్వంసాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది ‘మూసీ బ్యూటిఫికేషన్’ కాదు అని, అది ‘లూటిఫికేషన్’ అన్నారు.

కేవలం రూ.16 వేల కోట్లతో మొత్తం మురుగు నీటిని శుద్ధి చేయడంతోపాటు కొండపోచమ్మ నుంచి మంచి నీళ్లను మూసీలోకి తీసుకురావడం, రెండు వైపులా స్కైవేల నిర్మాణం వంటి అన్ని కార్యక్రమాలతో కూడిన సమగ్రమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్  ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నదని, కానీ కేవలం అవినీతి కోసం రేవంత్ రెడ్డి ఈ మూసీ ప్రాజెక్టును ఎత్తుకున్నారని కేటీఆర్ అన్నారు. రూ.16 వేల కోట్లతో జరిగే ప్రాజెక్టుని రూ.లక్షన్నర కోట్ల ఖర్చు కి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మూసీ సుందరీకరణకు తాము మద్దతు ఇస్తామని తెలిపిన కేటీఆర్ఆ  ప్రాజెక్టు పేరుతో మాత్రం లక్షలమంది జీవితాలను ఆగం చేస్తామంటే ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. స్వయంగా రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చెరువులలో ఇళ్లు కట్టుకుని ఉన్నారని, అలాంటి వారిని ముట్టుకోకుండా పేదలకు  మూసీ ఒడ్డున ఉన్నారు అంటూ పెంచిన బఫర్ జోన్ నిర్ణయాల వల్ల వారి ఇళ్లు కూలగొడతామని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి డీపీఆర్‌ సిద్ధం చేయకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా కేవలం ఇళ్లకు రెడ్ మార్కులు వేస్తూ ప్రజలపైన కేసులు పెడుతూ బెదిరింపులకు దిగుతూన్నారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పేదల ఇళ్లకు నష్టం జరగకుండా మూసీ సుందరీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పేదల ఇళ్లను కూలగొట్టి లక్షల కోట్ల ప్రభుత్వ, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన అవినీతికి వాడుకుంటామంటే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామన్నారు. ముందుగా నాగోల్ లో ఉన్న ఎస్టీపీసీని  తర్వాత నాగోల్ బ్రిడ్జి వద్ద గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన మూసీ మోడల్ ని కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుదీర్ రెడ్డి,లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ వాణి దేవి త‌దిత‌రులు పరిశీలించి అక్కడ బాధితులతో మాట్లాడారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *