మంత్రుల భేటీపై విష ప్రచారం తగదు

– కేబినెట్ అనేది ఒక యూనిట్
– అంద‌రం క‌లిసి బహిరంగంగా వెళ్తే రహస్యం ఏముంది?
– ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతీ చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ ‘రహస్య భేటీ’ అంటూ విష ప్రచారం చేయడం తగదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంత్రుల భేటీపై సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మంగళవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కొందరు కావాలనే పని గట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో కేబినెట్ అనేది ఒక యూనిట్.. పాలనాపరమైన అంశాల్లో ఎక్కడా జాప్యం ఏర్పడకుండా ఉండటానికి సీనియర్ మంత్రులుగా మేం చర్చించుకున్నాం.. అందులో తప్పేముంది అని ప్ర‌శ్నించారు. అది ప్రభుత్వ సమష్టి బాధ్యత .. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసంలో తాము భేటీ అయి పాలనాపరమైన అంశాలను చర్చించాం అని ఆయ‌న‌ స్పష్టం చేశారు. లోక్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి ముందే తామంతా ఒకే కారులో వెళ్లాం.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాం.. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సన్నద్ధత అనేది రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యత. దీనికి కూడా లేనిపోని రంగులు పూయడం సమంజసం కాదు అని దుద్దిళ్ల అన్నారు. నిర్మాణాత్మకమైన విమర్శలను తాము ఎప్పుడూ స్వాగతిస్తాం.. కానీ వ్యక్తిత్వ హననానికి, ఊహాజనిత కథనాలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం.. రాష్ట్రాభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం ఇకనైనా మానుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *