– హైకోర్టుకు వివరించిన తెలంగాణ ప్రభుత్వం
– అవకతవకలు, డబ్బు దుర్వినియోగంపైనే దృష్టి
– తదుపరి విచారణ 12కు వాయిదా వేసిన కోర్టు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు స్పష్టం చేశారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపారు. ఎవరినో టార్గెట్ చేసేందుకు జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ ఏర్పాటు, కమిషన్ అందించిన నివేదికపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏజీ, పిటిషనర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో అధికార దుర్వినియోగం జరిగిందని హైకోర్టుకు ఏజీ వెల్లడించారు. ఇక పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పలువురిపై కమిషన్ తప్పుడు అభియోగాలు నమోదు చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో బిజినెస్ రూల్స్ ఎక్కడా ఉల్లంఘించ లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినట్లు పిటిషనర్ తరుఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్‌ను సాక్షిగా పిలిచి దోషిగా ఆరోపణలు చేయడం సరికాదంటూ న్యాయవాది తన వాదనలు వినిపించారు. తప్పుడు విధానంలో కమిషన్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్థల మార్పిడి, ప్రాజెక్ట్ ఖర్చు అంచనాతోపాటు నిర్మాణ సంస్థలకు ఇవ్వడంలో ఎవరూ లబ్ది పొందలేదన్నారు. ఈ కమిషన్ నివేదిక చెల్లదని, దీనిపై స్టే ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్ న్యాయవాది కోరారు. ఈ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





