పోరాటాల గ‌డ్డ‌లో అనుకున్న అభివృద్ధి లేదు

– ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నిధులు
– నీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి
– బాస‌ర ఐఐఐటీలో యూనివ‌ర్సిటీ ఏర్పాటు
– జిల్లా రైతుల‌ కోసం తుమ్మిడిహ‌ట్టి ప్రాజెక్టు
– జిల్లాకు ఎయిర్‌పోర్టు, పారిశ్రామిక‌వాడ‌
– నిర్మ‌ల్ బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

నిర్మ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16:  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే త‌న‌కు ప్రత్యేక అభిమానమ‌ని, జల్ జంగల్ జమీన్ అని నినదించిన పోరాటాల గడ్డ ఇద‌ని, ఇప్ప‌టికీ  ఉమ్మడి ఆదిలాబాద్ లో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార‌ణం చేత‌నే  పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు ఇస్తానని చెప్పాన‌న్నారు. నిర్మల్ ‘ప్రజా పాలన- ప్రగతి బాట’ బహిరంగ సభలో శుక్ర‌వారం ఆయ‌న‌ ప్ర‌సంగిస్తూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా అభివృద్ధి పథంలో సాగేది.. కానీ కారణాలు ఏవైనా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రాజెక్టుల పూర్తి కోసం కృషి చేస్తున్నామ‌న్నారు. ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ మంజూరైనా ఎవరికి వారు తమ ప్రాంతానికే రావాలనుకోవడంతో యూనివర్సిటీ ఏర్పాటు జాప్యమైంద‌న్నారు. బాసర ఐఐఐటీలో యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుందామ‌న్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు సూచిస్తున్నాన‌న్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షలు నిర్వహించాలని పెద్దలు సుదర్శన్ రెడ్డికి సూచన చేస్తున్నాన్నారు. మీరు నివేదిక తయారు చేసి ఇవ్వండి.. ఆదిలాబాద్ కు కావాల్సిన అభివృద్ధి, రావాల్సిన నిధులను మంజూరు చేసుకుందాం అన్నారు. చనాకా-కొరాటా పంప్‌హౌస్‌ను మంత్రి ఉత్త‌మ్ కుమార్‌తో క‌లిసి ప్రారంభించి పూజ‌లు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా రూ.386.46 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసారు.

తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాల్సిందే

ఆదిలాబాద్ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలంటే తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాల్సిందే. బడ్జెట్ సమావేశాల లోపు ప్రాజెక్టుపై సంపూర్ణ నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచిస్తున్నాన‌న్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించుకుందాం.. ప్రతీ చుక్కను ఒడిసిపట్టుకుని జిల్లాను సస్యశ్యామలం చేసుకుందాం.. ఎర్ర బస్సు తిరగని ఆదిలాబాద్ లో ఎయిర్ బస్ తిరిగేలా ఎయిర్ పోర్టును ఏర్పాటు చేసుకుందాం.. కేవలం ఎయిర్ పోర్టు ఒక్కటే సరిపోదు.. అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసుకుందామ‌న్నారు. పదివేల ఎకరాలు సేకరించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుందాం.. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. ఎన్నికలు ముగిసాక అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళదాం.. అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవు. ప్రజలకు మంచి జరగాలన్నదే మా ఆలోచన అని చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని ఎన్నిసార్లయినా కలుస్తా

ప్రజల కోసం.. ప్రాంత అభివృద్ధి కోసం ఎవరినైనా కలవడానికి వెనకాడను.. పైరవీల కోసం ఎవరి దగ్గరకు వెళ్లను.. నాకు పర్సనల్ ఎజెండాలు లేవు .. ఆనాటి పాలకులు చేసిన అప్పులు ఉరితాడుగా మారి ప్రజల ఊపిరి తీసే పరిస్థితి ఏర్పడింది.. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని ఎన్నిసార్లయినా కలుస్తా అని రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మంజూరు చేయించుకుందాం.. ఇందుకు బీజేపీ ప్రజా ప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలి అని కోరారు.పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ఎజెండా అంటూ రాష్ట్రం అమ‌లు చేస్తున్న ఆయా ప‌థ‌కాల‌ను వివ‌రించారు. ప్రజలకు మంచి జరుగుతుంటే పదేండ్లు అధికారం అనుభవించిన వాళ్లు చూసి ఓర్వలేకపోతున్నారని విమ‌ర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసేవారిని, అభివృద్ధి చేసే వారినే గెలిపించుకోండ‌ని పిలుపునిచ్చారు. చనాక- కొరటాకు సి.రామచంద్రా రెడ్డి పేరు, సదర్మట్ బ్యారేజీకి నర్సారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామ‌న్నారు. ప్రజలకు సే వలందించిన ఆ ఇద్దరి పేర్లు రెండు ప్రాజెక్టులకు పెట్టాలని అధికారులకు సూచన చేస్తున్నాన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *