కేబినెట్‌ నిర్ణయించకుండా పనులు చేపడతారా?

సీఎం రేవంత్‌ రెడ్డికి ఈ విషయం తెలియదా
కాళేశ్వరం కూడా కేబినేట్‌ నిర్ణయం మేరకే జరిగింది
ప్రాజెక్టులు కట్టడం వేరు.. అవినీతి చోటుచేసుకోవడం వేరు
అందుకే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణను కోరుతున్నాం
సీఎం వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్‌ స్పందన

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19: ‌సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రొజెక్టులు రీ డిజైన్‌లో కేసీఆర్‌ చేర్చారు.. అవినీతి జరిగితే విచారణ జరపండి.. విచారణ జరిగినా చర్యలు తీసుకుంటారా అని నమ్మకం లేదు.. అందుకే సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేస్తున్నామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రాజెక్టులు రాజకీయ పార్టీలకు ఏటిఎంలుగా మారాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాటలపై ఈటల స్పందించారు. ఈ సందర్భంగా కేబినెట్‌లో ఆమోదం లేకుండా ఏమీ జరగదు.. ఆయన మంత్రివర్గంలో ఉన్నవారే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలోనూ ఉన్నారంటూ ఈ విషయం వారిని అడగవచ్చని సూచించారు. కేసీఆర్‌ మొదలుపెట్టిన ప్రాజెక్టు అని నేను చెప్పాను.. అది ఎప్పుడు మొదలయ్యిందో తెలుసుకోవాలని పేర్కొన్నారు. అయితే మొదట పిల్లర్లు రిపేర్‌ చేసి నీళ్లు ఇచ్చే పని పెట్టుకోండని ప్రభుత్వానికి సూచించారు. ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు.. వాటి పేరుతో అక్రమాలు చేయడం తప్పు అని అన్నారు. కేబినెట్‌ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందా అని ప్రశ్నించారు. ప్రతి నిర్ణయంపై కేబినెట్‌ రాటిఫికేషన్‌ జరుగుతుంది.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని డాక్యుమెంట్స్‌ విూకు పంపిస్తాను అని చెప్పుకొచ్చారు. విూ డిపార్ట్‌మెంట్‌ ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కేబినెట్‌లో పెట్టండి అని కేసీఆర్‌ చెప్పే వారు.. ఇది నిజం కాదంటే నేను దేనికైనా సిద్ధం అని ఈటల అన్నారు. ప్రాజెక్ట్‌ నిర్మించాలి.. కానీ వాటిని అడ్డ పెట్టుకొని సంపాదించడాన్ని తమ బీజేపీ  వ్యతిరేకిస్తుందని ఈటల చెప్పారు. ఇక, తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిందని తెలిపారు. నేను జైళ్లకు పోయిన.. నా రక్తం చిందింది.. పెట్రోల్‌ మంటల్లో యువత కాలిపోయింది, ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్టు కట్టాలా? వద్దా? అని ప్రశ్నించారు. అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలోనే మొదలు పెట్టారు కానీ పూర్తిచేయలేదు.. జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల ఐదేళ్లలో పూర్తి చేసే ప్రాజెక్టే కదా? ఎందుకు పూర్తి చేయలేదన్నారు. విచారణ కమిషన్‌ త్వరగా పూర్తి చేయాలి.. అవినీతిని నిగ్గు తేల్చాలి.. అధికారం అడ్డం పెట్టుకొని టెండర్లు లేకుండా పనులు పంచుకోవడం తప్పు అని ఎంపీ ఈటల పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *