నవ నామ వాసంతి

ఆనంద రసాన్వేషణలో
సుఖదుఃఖాలు కలగలిసిపోగా
ఎన్ని రుచులో! మనిషి జీవితంలో….

కాలచక్ర భ్రమణంలో…

తెలుగు లోగిళ్ల ముంగిట రంగవల్లులు
సంప్రదాయ వైభవాలను చాటిచెప్పగా,
ఘల్లు ఘల్లున
అందెల రవళులు మ్రోగిస్తూ,
మోమున చిరునవ్వులు చిందిస్తూ
నవ్యరాగాలనాలపిస్తూ,
వయ్యారంగా ముత్తెపు దోసిలితో
శుభాలనొసంగ,
విరహార్తులపాలిట మరుని సాయకమై,
పచ్చని పావడ ధరించి
అరుదెంచె వాసంత లక్ష్మి
‘‘విశ్వావసు’’అనే క్రొంగొత్త పేరుతో.

ఆమని సొగసులతో పులకించిపోతున్న
పుంస్కోకిలల రాగాల నాస్వాదిస్తూ,
మధుమాసంలా
మోడువారిన శిశిరాన్ని చిగురింపచేస్తూ
మరపురాని జ్ఞాపకాల కలలుకంటూ,
నిత్య చైతన్య ప్రహేళికలతో,
స్వాప్నికలోకపు సౌందర్యసీమలో
మల్లెల సుగంధాల జల్లులు కురిపిస్తూ,
స్వచ్ఛచంద్రికా తరంగాలలో మునకలేస్తూ
కాలం ఒడిలో,
అనుభవాల జడిలో,
ఎద కోరిన సుందర చిత్రపటాన్ని
ఆవిష్కరించగ వచ్చిన
ప్రకృతి కాంత రమణీయతను ఆస్వాదిద్దాం
కాలం మార్పు సహజమేనంటూ…

   – వేమూరి శ్రీనివాస్‌
                   9912128967
                  ‌తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *