ప్ర‌జల మేలు కోసమే సరికొత్త సంస్క‌ర‌ణ‌లు

22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌ల్లోకి స్లాట్ బుకింగ్
స్లాట్ బుకింగ్ కు అనూహ్య స్పంద‌న‌.. మొద‌టి రోజు 626 రిజిస్ట్రేష‌న్లు
రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : ప్ర‌జ‌ల‌కు సులువుగా న్యాయమైన, వేగవంత‌మైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ సేవ‌ల‌ను ప్రారంభించిన‌ట్లు రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ప్ర‌యోగాత్మ‌కంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని 22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో గురువారం నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమ‌లులోకి వొచ్చింద‌ని ఇక్క‌డ వొచ్చే ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తామ‌న్నారు. రెవెన్యూ విభాగంలో ఏ సంస్క‌ర‌ణ చేప‌ట్టినా, ఏ విధానప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకున్నా ప్ర‌జ‌ల కోణంలోనే ఉండాల‌ని అధికారుల‌కు సూచించారు. తొలిరోజు స్లాట్ బుకింగ్ అమ‌లు, ప్ర‌జల నుంచి వొస్తున్న స్పంద‌న‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ స్లాట్ బుకింగ్‌పై ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అధికారుల‌కు సూచించారు.

ఆస్తుల రిజిస్ట్రేష‌న్ కోసం తొలిరోజు గురువారం 626 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నార‌ని తెలిపారు. రిజిస్ట్రేష‌న్‌కు వొచ్చి గంట‌ల త‌ర‌బ‌డి చెట్ల కింద నిరీక్షించి క్యూ లైన్ల‌లో నిల్చోనే ప‌రిస్దితికి అడ్డుక‌ట్ట వేసేందుకు, స‌మ‌యాన్ని ఆదా చేసేందుకు, పార‌ద‌ర్శ‌క‌త‌ను తీసుకురావ‌డానికి ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువొచ్చామని చెప్పారు. త్వ‌ర‌లో క్యూలైన్ల‌కు గుడ్‌బై చెప్పే రోజులు వొస్తాయ‌ని ద‌ళారులు ప్ర‌మేయం కూడా ఉండ‌బోద‌న్నారు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తవుతుండ‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నార‌న్నారు.

రిజిస్ట్రేష‌న్ శాఖ అధికారిక వెబ్ సైట్ registration.telangana.gov.in స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏరోజు వీలుంటే ఆరోజు ఆ స‌మ‌యానికి వొచ్చి రిజిస్ట్రేష‌న్ చేయించుకునేలా స్లాట్ బుకింగ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. అలాగే సేవల్లో జాప్యం, సిఫార్సులు, దళారుల జోక్యం లేకుండా ప్ర‌జ‌లు మెరుగైన సేవలు అందుతాయ‌ని అన్నారు. స్లాట్‌ బుకింగ్‌ ద్వారా అపాయిమెంట్‌ తేదీ, సమయాన్ని కూడా ముందే తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. నిర్దేశిత తేదీ, సమయంలో ఎటువంటి హడావిడి లేకుండా రిజిస్ట్రేషన్‌ పని పూర్తి చేసుకోవచ్చన్నారు. కొనుగోలుదారులు, అమ్మకం దారులు, సాక్షులు తగిన సమయంలోనే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు చేరుకోవడానికి వీలు కలగనుంది. పారదర్శకతతో మధ్యవర్తుల ప్రభావానికి తెరపడనుందని మంత్రి పొంగులేటి అన్నారు.

స్లాట్ బుకింగ్ విధానం అద్భుతంగా ఉంది
గ‌ట్టు శ్రీ‌నివాస్ (మేడ్చ‌ల్ స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీస్)

మేడ్చ‌ల్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో గురువారం ఓ ఆస్తి కొనుగోలు కోసం స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తిచేసుకున్నారు. ఈ కొత్త విధానం క్ర‌యవిక్రయదారులకు చాలా సౌక‌ర్యంగా ఉంది. రిజిస్ట్రేష‌న్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుని నిర్ణీత స‌మ‌యానికి వెళ్లాం. తొలిరోజైన‌ప్ప‌టికీ కేవ‌లం 20 నుంచి 30 నిమిషాల వ్య‌వ‌ధిలో పూర్త‌యింది. తామే రిజిస్ట్రేష‌న్ మాడ్యూల్‌లో డాక్యుమెంట్ల‌ను అప్‌లోడ్ చేశాం. అన్నీ ఆన్‌లైన్‌లోనే జ‌రిగినందున ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌లేదు, మాకు పూర్తిగా స‌మ‌యం ఆదా అయింది. ఎక్క‌డా అసౌక‌ర్యం లేదు. రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది చాలా సేవాభావంతో స‌హ‌క‌రించారు. ఈ కొత్త స్లాట్ బుకింగ్ విధానం చాలా బాగుంది. అధికారుల‌పై వొత్తిడి క‌నిపించ‌లేదు. ఎటువంటి అద‌న‌పు ఖ‌ర్చులు లేకుండా సుల‌భంగా సాగింద‌ని శ్రీ‌నివాస్ సంతోషం వ్య‌క్తం చేశారు.

కొత్త విధానాన్ని కొన‌సాగించండి :
ఘ‌న శ్యామ్ ప‌టేల్ (శంషాబాద్ స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌)

స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానం తొలిరోజు కొంత స‌మ‌యం తీసుకున్నా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ సాఫీగా సాగింది. శంషాబాద్‌ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో గురువారం నా ఫ్లాట్‌ను మ‌రొక‌రికి రిజిస్ట్రేష‌న్ చేయించాను. మొత్తం ప్ర‌క్రియ చాలా వెసులుబాటుగా, స‌మ‌యం ఆదా చేసే విధంగా ఉంది. న‌న్ను నిర్ధిష్ట సమ‌యానికి పిలిచిన‌ప్ప‌టికీ కొన్ని డాక్యుమెంట్ల స‌మ‌ర్ప‌ణ‌, స‌మాచార పూర‌ణ స‌క్ర‌మంగా లేనందున సుమారు గంట‌కుపైగా ఆల‌స్యం జ‌రిగింది. ఈ విష‌యంలో రిజిస్ట్రార్ కార్యాల‌యం త‌ర‌పున ఎటువంటి జాప్యం లేదు. క్ర‌య విక్ర‌య‌దారులు పూర్తి అవ‌గాహ‌న పెంచుకుంటే కేవ‌లం అర‌గంట‌లోగానే ప‌నులు పూర్త‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. కార్యాల‌యంలో ఎటువంటి అవినీతి, ర‌ద్దీ లేకుండా సాగిన ఈ ప్ర‌క్రియ‌ను ఇలాగే కొన‌సాగించాలి దీనివ‌ల‌న ప్ర‌యోజ‌నాలు స్ప‌ష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్యాల‌య సిబ్బంది నుంచి స‌హ‌కారం, మార్గ‌ద‌ర్శ‌క‌త్వం ల‌భించాయి. అందువ‌ల‌న తాము ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌లేద‌ని ఘ‌న‌శ్యామ్ ప‌టేల్ చెప్పారు

అప్పుడు 3 గంట‌లు ఇప్పుడు అర‌గంట లోపే:
సి.స్వాతి, వ‌ల్ల‌భ్ న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీస్


స్లాట్ బుకింగ్ విధానంలో మార్ట్‌గేజ్ ( త‌న‌ఖా) రిజిస్ట్రేష‌న్ చాలా సులువుగా సాగింది. ఆస్తి మార్ట్‌గేజ్ రిజిస్ట్రేష‌న్‌ కోసం స్లాట్ బుకింగ్ చేసుకొని వ‌ల్ల‌భ్‌న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యానికి వెళ్లాము. 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తిచేసుకొని బ‌య‌ట‌కు రావడం జ‌రిగింది. మూడు నెల‌ల క్రితం ఇదే ఆఫీసులో రిజిస్ట్రేష‌న్‌కు వ‌స్తే 2 నుంచి 3 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఈ స్లాట్ బుకింగ్ తోటి స‌మ‌యం ఆదా అవుతుంది. అనుకునే స‌మ‌యానికి ప‌నిపూర్తి చేసుకొని స్వంత‌ప‌నుల‌కు వెళ్ల‌డానికి ఈజీ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *