17 వరకు సర్వేయర్ల నియామక దరఖాస్తుల స్వీకరణ
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రైతులకు మరింత మెరుగైన సేవలందించేలా భూ లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో విజయవంతమైన లైసెన్స్‌డ్ సర్వేయర్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఐదు వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని తెలిపారు. ఇందుకోసం ఈ నెల 17 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి తెలంగాణ సర్వే శిక్షణ అకాడమీలో శిక్షణ ఇస్తామని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న లైసెన్స్‌డ్ సర్వే విధానంపై ఇటీవల సర్వే విభాగానికి సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారని , ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్ పథకం 1999 లో కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ చట్టంలో చేసిన సవరణలతో ప్రారంభమై, 2005-06 నుంచి అమలులోకి వొచ్చిందని ఈ పథకం ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌కు ముందు మ్యూటేషన్ స్కెచ్ (పీఎంఎస్) తయారు చేయబడుతుందని, ప్రీ-రిజిస్ట్రేషన్ స్కెచ్‌తో కొనుగోలు చేయబోయే భూమి గురించి విస్తీర్ణం, టైటిల్ వంటి స్పష్టమైన భూసరిహద్దు వివరాలు ఉంటాయని అధికారులు గురువారం మంత్రికి వివరించారు.
ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 6000 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు ,4000 మంది ప్రభుత్వ సర్వేయర్లు సేవలందిస్తున్నారని ఒక్కో లైసెన్స్‌డ్ సర్వేయర్ కు నెలకు సగటున 23 దరఖాస్తులు వొస్తాయని దీని ద్వారా అతనికి నెలకు 25 వేల నుండి 30 వేల ఆదాయం వొస్తుందని తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు నిర్వహించి, రిజిస్ట్రేషన్ కు ముందు స్కెచ్ తయారుచేసి పోర్టల్లో అప్ లోడ్ చేస్తారు. వీరి పనులను ప్రభుత్వసర్వేయర్లు పరిశీలించి, సంబంధిత అధికారి (ఏడీ, ఎస్ అండ్ ఎల్ఆర్) ఆమోదిస్తారు.
ఈ పథకం ద్వారా భూలావాదేవీలు మరింత సమర్థవంతంగా, శాస్త్రీయంగా సాగుతున్నాయని అధికారులు వివరించారు. దీనిపై మంత్ పొంగులేటి స్పందిస్తూ తెలంగాణలో శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, ఈ భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాపును జత పరచడం తప్పనిసరి చేసిన నేపధ్యంలో ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విధానం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఆయా మండలాల్లో భూలావాదేవీలు, భూ విస్తీర్ణాన్ని బట్టి సర్వేయర్లను నియమించాలని అధికారులకు సూచించారు. కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్ల క్రితం నియమితులైన సర్వేయర్లు కొనసాగుతునేఉన్నారని ఇక్కడ కూడా అదే విధానాన్ని అవలంభించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.



