హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఏకంగా 4013 పోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్‌రావు అండ్ టీమ్ అంగీకరించింది. అందులో 618మంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. 618మందిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యులు, ఈటల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులతోపాటు అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. త్వరలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు పద్మా దేవేందర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, తాటికొండ రాజయ్యలకు సిట్ నోటీసులు ఇవ్వనుంది. ఐఏఎస్‌లు రోనాల్డ్ రాస్, గౌతంల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. మొత్తం 618మంది స్టేట్‌మెంట్లను కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇప్పటివరకు 228 మంది స్టేట్‌మెంట్ రికార్గింగ్ పూర్తయ్యాయి. 2023 నవంబర్ నెలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ డాటా మాత్రమే విచారణ అధికారుల వద్ద ఉంది. మిగిలిన డాటా ధ్వంసమైన విషయం విదితమే. ఇంతటి సంచలనమైన కేసును సీబీఐకు అప్పగించాలని, సీబీఐ విచారణలోనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టేది లేదని, విచారణలో ఎవరి ప్రమేయం ఉన్నా అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే ఇప్పటికి అధికారుల వరకు మాత్రమే విచారణ, అరెసస్టులు జరగగా.. అధికారుల వెనక ఉన్న అప్పటి బీఆర్‌ఎస్ నేతలు ఎవరనేది మాత్రం దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ లీగల్ సెల్ చైర్మెన్ దేవరాజు గౌడ్‌కు సిట్ బృందం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో చంద్రశేఖర్ రెడ్డి, ఆయన పీఎ కరుణాకర్ రెడ్డి, డ్రైవర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు అరవింద్ సిట్ ముందు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో పలుమార్లు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడి కూడా జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు





