అమ్మా! మాదా కబళము
లేదు పోరా!
అమ్మా! ఆకలి తల్లే
చెబుతుంటే నీక్కాదూ
కసురుకున్న విసుగు శబ్దం
ఆకలిక్కూడా సిగ్గయి
తలవంచుకొని వెనుదిరిగి పోయింది
కానీ ఈ కొత్త ఆకలికి
సిగ్గూ శరమూ లేదే
తను ఆశ్రయించిన బిచ్చగాన్ని
పదే పదే రెచ్చగొడుతుంది
నిస్సిగ్గుగా జోలె చాపి
మరీ మరీ దేబిరిస్తుతుంది
ఎన్నో నెత్తురుటేర్లకు
ప్రత్యక్షంగానో పరోక్షంగానో
తనే కారణ మైన రహస్యం మీద
మరుగు కోసం తెరలు దింపుతుంది
ఇరుగమ్మలను పొరుగమ్మలను కూడా
తన జోలె నింపమనండి అని
లాబీయింగుకు పురికొలుపుతుంది
తన నెత్తుటి ఆకలి తీరడానికి ఎన్ని
ఎన్ని కత్తుల గంపలను
అమ్ముకుందని!
ఎందరి ఇళ్ళద్వారాలకో
శాంతి లేని రాత్రుల కంచెను నాటి
తన ఆకలి జోలెలో మాత్రం
‘శాంతి’ని బిచ్చమేయండని
గొంతు చించుకుంటుంది
ఆ ‘శాంతి’ దక్కక
తన కలలన్నీ కల్లలు కాగానే
నిప్పులు తొక్కిన కోతిలా
చిందులు వేస్తున్నది
-డా. దిలావర్
కొత్త బిచ్చగాడు





