విలువ‌ల‌తో కూడిన విద్య అవ‌స‌రం

– ప్రైవేటు స్కూళ్ల విద్యార్థుల‌తో పోటీ ప‌డుతున్న ఎస్టీ విద్యార్థులు
– అక్ష‌రాస్య‌త ద‌శ‌నుంచి ర్యాంకుల స్థాయికి ఎదిగాం
– స‌మాన‌త్వాన్ని తెచ్చేది విద్య‌మాత్ర‌మే
-డిమాండ్ ఉన్న కోర్సుల‌పై టీచ‌ర్లు విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి
-మంత్రి సీతక్క
ఇతర విద్యార్థుల కన్నా గిరిజన విద్యా సంస్థల విద్యార్థులకు మంచి మార్కులు వచ్చేలా పనిచేసిన టీచర్లకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క శుభాకాంక్ష‌లు తెలిపారు. బంజారాహిల్స్ లోని కొమరం భీం ఆదివాసి భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధ‌వారం ఏర్పాటు చేసిన ఎక్కడ మిక్స్ సక్సెస్ మీట్ 2025 లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చదువులో సత్తా చాటిన గిరిజన విద్యార్థులకు, గిరిజన విద్యా సంస్థల సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు ఎంతో కీలక మైంది. కానీ గిరిజ‌న ప్రాంతాల్లో విద్యావ‌కాశాలు లేక‌పోవ‌డంతో మనల్ని చిన్న చూపు చూసారన్నారు. ఆవిధంగా అక్ష‌రానికి దూర‌మైన మ‌న‌ల్ని అనాగరికలనీ ముద్ర వేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ మారిన నేటి ప‌రిస్థితుల్లో ప్రైవేటు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌తో ఆదివాసి విద్యార్థులు పోటీ పడుతుండ టం గ‌ర్వంగా వున్న‌ద‌న్నారు. ఎస్టీలు అధికంగా ఉన్న ములుగు ఆసిఫాబాద్ మహబూబాబాద్ జిల్లాలు టెన్త్ ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానాల్లో నిలిచాయ‌ని చెబుతూ విద్యకు ముఖ్యమంత్రి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తుచేశారు.
8 ఏళ్ల తర్వాత డైట్ ఛార్జీలు, పదహారేళ్ల తర్వాత కాస్మొటిక్ ఛార్జీలు పెంచార‌న్నారు. గిరిజ‌నుల‌ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది కాబ‌ట్టే గిరిజన విద్యా సంస్థల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతోంద‌న్నారు. నిరక్షరాస్యత దశ నుంచి అక్షరాస్యత దశ దాటుకొని ఇప్పుడు రాష్ట్రానికి టాపర్స్ గా మారే దశకు చేరుకోవ‌డం ఎంతో ఆనందం క‌లిగిస్తోంద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహం, గురుకుల విద్యాసంస్థల సిబ్బంది సహకారంతో గిరిజన విద్యా సంస్థలు మంచి ఉతీర్ణత సాధించాయ‌ని ప్ర‌శంసించారు. ఇతర విద్యాసంస్థలకన్నా, రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ మార్కులు సాధించ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు.  పది కంటే ఇంటర్ లో ఉత్తీర్ణ‌తా శాతం తక్కువ వున్న‌ద‌ని పేర్కొంటూ అందరూ 90 శాతం మార్కులు సాధించేలా క‌లిసిక‌ట్టుగా కృషిచేద్దామ న్నారు. మూస పద్ధతి లో కాకుండావిలువలు, వినయం, సంస్కారం, సామాజిక స్పృహ, సమానత్వ భావన నేర్పించేలా బోధ‌న వుండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మంచి మార్కులు వస్తే గర్వప‌డొద్దు. విద్య తో ఎదగాలి వినయంతో మెలగాలి.. అప్పుడే ఉన్నత శిఖరాలు చేరుకోవ‌డం సాధ్య‌మ‌న్నారు. ఆదివాసీ గిరిజనులు తమ అస్తిత్వాన్నిపరిరక్షించుకోవాలి, సంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి, విద్యాసంస్థల్లో ఎస్టీల ప్రత్యేక సంస్కృతిని కాపాడాల‌ని పిలుపు నిచ్చారు.
ఆదివాసి గిరిజనులో సాంస్కృతిక మార్పు జరగ కూడదు. గిరిజన విద్యాసంస్థల్లో బోధిస్తున్న ఇతర వర్గాల టీచర్లు తమ సంస్కృతి సాంప్రదాయాలను గిరిజన విద్యార్థుల మీద రుద్ద కూడ‌ద‌న్నారు. చదువుతోపాటు ఆదివాసి గిరిజన సాంప్రదాయాలు నేర్పించాల‌న్నారు. ఆదివాసి గిరిజన విద్యార్థులు తమ ప్రత్యేకతను కాపాడుకోవాల‌ని కోరారు. మన ప్రత్యేకత ను కోల్పోతే మన అస్తిత్వం కనుమరుగవుతుంది.. అది మన ఉనికికి ప్రమాదమ‌న్నారు. అస్తిత్వం కోల్పోయిన త‌ర్వాత  మన అభివృద్ధిని ఎవరూ పట్టించుకోరన్నారు. అందుక‌నే మ‌నం ఎంత ఎత్తుకు ఎదిగినా మ‌న మూలాలు, అస్తిత్వాన్ని మ‌రువ‌కూడ ద‌న్నారు. గిరిజ‌నులుగా చెప్పుకోవ‌డానికి ఎంత‌మాత్రం భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.  విద్య‌లో వ‌స్తున్న మార్పుల‌తో పాటు భాషా సంప్ర‌దాయాల‌ను కూడా  విద్యార్థుల‌కు టీచ‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుండాల‌న్నారు. ఈ శాఖ‌కు సీఎం మంత్రి అయితే, నేను డాట‌ర్‌ను అన్నారు. ఏస‌మ‌స్య ఉన్నా నిర్భయంగా త‌న‌తో చెప్పుకోవ‌చ్చ‌న్నారు. ఏ కోర్సులు కు డిమాండ్ ఉన్నాయో వాటిని నేర్పాలి. పది, ఇంటర్ తరువాత స్టూడెంట్స్ గైడెన్స్ దొరకట్లేదు. ఇది చాలా అవ‌స‌ర‌మ‌న్నారు.
హాస్ట‌ల్ విద్యార్థుల‌కు నేటి ధ‌ర‌ల‌కు అనుగుణంగా త‌మ ప్ర‌భుత్వం భోజ‌న, కాస్మొటిక్ ఛార్జిలు పెంచామ‌న్నారు. సన్న బియ్యం 50 రూపాయలు ఉన్నాయి ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ధరలు పెంచిందని గుర్తుచేశారు. ఈ స‌మావేశంలో నాకు చ‌దువు చెప్పిన ఇద్ద‌రు టీచ‌ర్లున్నారు. వారి ప్రోత్సాహం తోనే ఈ స్థాయికి ఎదిగాన‌ని సీత‌క్క చెప్పారు. నిత్యం విద్యార్థిగా వుంటే ఎంతో సంతృప్తిగా వుంటుంద‌న్నారు. కొత్తది నేర్చుకోవాలి.. నేర్చుకున్నది పది మందికి పంచాలి అన్నదే నా ఫిలాసఫీ. అందువల్ల‌నే రెండోసారి పి.హెచ్‌డి.కోసం ప్ర‌వేశ‌ప‌రీక్ష రాశాన‌న్నారు.  ప్ర‌తిభా పుర‌స్కారాల‌ను అందుకున్న విద్యార్థులు త‌మ ప్ర‌తిభ‌కు మ‌రింత ప‌దునుపెట్టాల‌న్నారు. పుర‌స్కారం అంద‌ని విద్యార్థులు మ‌రింత ప‌ట్టుద‌ల‌తో చ‌దువుకోవాల‌న్నారు. ఈ ఏడాది నుంచి టీచ‌ర్ల‌కు రెండుసార్లు శిక్ష‌ణ ఇస్తాం. ఈసారి విద్యార్థులు మ‌రిన్ని మెరుగైన ఫ‌లితాలు సాధించాల‌ని కోరారు. దేశ భ‌విష్య‌త్తు విద్యార్థుల చేతుల్లో వుంటే, విద్యార్థుల భ‌విష్య‌త్తు టీచ‌ర్ల చేతుల్లో వుంటుంద‌న్నారు.  అంతా విద్యావేత్త‌ల‌యిన‌ప్పుడే అంత‌రాలు స‌మ‌సిపోతాయ‌న్నారు.
అనంత‌రం టెన్త్ ఇంటర్ ఎంసెట్ జేఈఈ మెయిన్స్ లో చక్కటి ప్రతిభ కనపరిచి స్టేట్ ర్యాంకర్స్ గా పిలిచిన గిరిజన గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను మంత్రి సీత‌క్క స‌న్మానించారు. స్టేట్ ర్యాంకర్స్ కి సర్టిఫికెట్లు ప్రదానం చేసి, వారితో స‌హ‌పంక్తి భోజ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా గిరిజన గురుకుల ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఆదివాసి గిరిజన పెయింటింగ్స్ తో రూపొందించిన చీరను మంత్రి సీతక్క కు బహుకరించ‌గా, మంత్రి వారిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *