ఎన్డీయే కోటి వరాల హామీలు బూటకం

– ఒక్కసారి మహాగఠ్‌బంధన్‌కు అవకాశం ఇవ్వండి
– తెలంగాణ మోడల్‌ పాలన అందిస్తాం
బీహార్‌ ప్రజలకు మంత్రి పొంగులేటి పిలుపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రెండు దశాబ్దాలపాటు అవినీతి అక్రమాలు అవకాశవాద రాజకీయాలతో బీహార్‌ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిరదని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల పరిశీలకుడు, తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీహార్‌ రాష్ట్రం పశ్చిమ చంపారన్‌ జిల్లా చనుపటియా అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమికి ఓటమి భయం పట్టుకుందని, అందువల్లే అలవికాని హామీలను ఇస్తున్నదని విమర్శించారు. వారి ఎన్నికల ప్రణాళికలో కోటి వరాలు ప్రకటించడం, యువతకు కోటి ఉద్యోగాలు, కోటిమంది లక్‌పతి దీదీలు హామీలు ఇచ్చారని, అధికారంలో ఉన్న ఈ 20 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.. ఎంతమంది దీదీలను లక్‌పతులుగా చేశారు అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వీటిని అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీహార్‌ ప్రజలను కొత్తకొత్త హామీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మహాగఠ్‌బంధన్‌(ఎంజీబీ)ను గెలిపిస్తే తెలంగాణ మోడల్‌ పాలనను అందిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని వివరించారు. రైతులకు రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే సిలిండర్‌, ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి హామీలను అమలు చేస్తున్నామని వివరించారు. బీహార్‌ ప్రజలు ఈసారి విజ్ఞతతో ఆలోచించి  ఎంజీబీకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తమ కూటమి గెలిస్తే యువకుడైన తేజస్వియాదవ్‌ ముఖ్యమంత్రి అవుతారని, ఏన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరన్న విషయాన్ని ప్రకటించలేని దుస్ధితిలో ఉందని విమర్శించారు. బహిరంగ సభలో ఆ రాష్ట్ర ఇన్‌చార్జ్జి కృష్ణ అల్వర్‌, ఎంజీబీ అభ్యర్థి అభిషేక్‌ రంజన్‌, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *