– జర్నలిజంలో వింత పోకడలు
– జర్నలిస్టు అనే పదాన్ని నిర్వచించాల్సిన పరిస్థితి
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల సహకారం ఎంతో ఉంది.. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కమ్యూనిస్టులు ఉప్పు లాంటివారు.. ఉప్పు లేని వంట రుచి ఉండదు.. అలాగే ప్రజా సమస్యలపై పోరాటంలో ఎర్ర జెండా కనిపించినప్పుడే వాటి పరిష్కారం జరుగుతుందని అన్నారు. నవ తెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయని, వాటిలో నవ తెలంగాణ ఒకటి అని అన్నారు. తమ సంపాదనను కాపాడుకోవడానికి, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొన్ని రాజకీయ పత్రికలు పనిచేస్తున్నాయని, దీంతో జర్నలిజం అనే పదానికి అర్థం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిజంలో ఓనమాలు తెలియని కొంతమంది జర్నలిస్టు ముసుగులో సోషల్ మీడియా పేరుతో తిరుగుతున్నారని, నిజమైన జర్నలిస్టులు సెమినార్లు నిర్వహించి జర్నలిస్టు పదాన్ని నిర్వచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎం విమర్శించారు. రాజకీయ నాయకుల విశ్వసనీయతలాగే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతోంది.. నిజమైన జర్నలిస్టులు దీనికి ఒక లక్ష్మణ రేఖ గీయాల్సిన పరిస్థితి ఏర్పడిరది అని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపండి : పొంగులేటి
రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా రాసే నవ తెలంగాణ పత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పత్రికా నిర్వహణలో ఎన్నో ఇబ్బందులున్నా ఒక నిబద్దతతో ముందుకు సాగుతోందన్నారు. కమ్యూనిస్టు సోదరులు పేదల పక్షాన నిలిచి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తూ పేదలకు అండగా నిలుస్తుంటారని అన్నారు. వారి పోరాటాలలో నిజాయతీని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ విషయంలో పనిచేస్తోందన్నారు. గత పదేళ్ల పాలనను, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ పాలనను పరిశీలించండి అని అయన సూచించారు. గులాబీ రంగు వేసుకున్న పత్రికలు ముఖ్యమంత్రితోపాటు అధికారులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై అసంబద్ధంగా పతాక శీర్షికలలో వార్తలను ప్రచురించినా ఈ ప్రజా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో సాగుతోందన్నారు. ఇలాంటి గులాబీ రంగు పాత్రికేయాన్ని ఒకస్ధాయి వరకే ఉపేక్షిస్తామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నిజాన్ని నిర్భయంగా రాసే ప్రక్రియ కొనసాగించండి.. తప్పులను పత్రికాపరంగా మా దృష్టికి తీసుకురండి. ప్రభుత్వపరంగా నవ తెలంగాణకు మా సంపూర్ణ సహాయసహకారాలను అందిస్తామని నవ తెలంగాణ యాజమాన్యానికి హామీ ఇచ్చారు.



