– బాలల పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి
న్యూదిల్లీ, డిసెంబర్ 26: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూదిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ధైర్యసాహసాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు-సంస్కృతి రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పురస్కారాలు గెలుచుకున్న బాలలు తమ కుటుంబాలకు, సమాజానికి, దేశం మొత్తానికి గర్వకారణమన్నారు. ఈ పురస్కారాలు దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు స్ఫూర్తినిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారతీయులందరూ గౌరవించే సిక్కుల పదో గురువైన గురు గోవింద్ సింగ్, ఆయన నలుగురు కుమారులు దాదాపు 320 ఏళ్ల క్రితం సత్యం, న్యాయం కోసం పోరాడుతూ తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. పిన్న వయస్కులైన ఇద్దరు సాహిబ్‌జాదాల ధైర్యాన్ని దేశ, విదేశాల్లో కీర్తిస్తారని ఆమె అన్నారు. సత్యం, న్యాయం కోసం తమ ప్రాణాలను అర్పించిన బాల యోధులను ఆమె స్మరించుకున్నారు. చిన్నారుల్లో దేశభక్తి, ఉన్నత ఆదర్శాలు ఉన్నప్పుడే ఆ దేశం గొప్పగా మారుతుందన్నారు. ధైర్యసాహసాలు, కళలు-సంస్కృతి, పర్యావరణం, ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతికత, సామాజిక సేవ, క్రీడలు తదితర రంగాల్లో చిన్నారులు అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఏడేళ్ల వాకా లక్ష్మీ ప్రాజ్ఞిక లాంటి చిన్నారుల వల్ల అంతర్జాతీయ యవనికపై చదరంగంలో శక్తిమంతమైనదిగా భారత్‌ను పరిగణిస్తున్నారన్నారు. తమ ధైర్యం, తెలివితేటలతో అజయ్ రాజ్, మహ్మద్ సిడాన్ పీ అనేకమంది ప్రాణాలు కాపాడారని, వారు ప్రశంసలకు అర్హులని అన్నారు. ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో ధైర్యవంతులైన తొమ్మిదేళ్ల వ్యోమ ప్రియ, పదకొండేళ్ల కమలేష్ కుమార్ మరణించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ పదేళ్ల శ్రవణ్ సింగ్ తన ఇంటికి సమీపంలోని దేశ సరిహద్దుల్లో ఉన్న భారతీయ సైనికులకు క్రమం తప్పకుండా నీరు, పాలు, లస్సీ అందించాడు. దివ్యాంగ బాలిక అయిన శివానీ హోసూరు ఉప్పర తన ఆర్థిక, శారీరక పరిమితులను అధిగమించి క్రీడా రంగంలో అద్భుతమైన విజయాలను సాధించింది. పోటీ, ప్రతిభావంతులు అధికంగా ఉండే క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ తనకంటూ ఓ పేరును సంపాదించుకొని అనేక రికార్డులు నెలకొల్పాడు. ఇలాంటి ధైర్యవంతులు, ప్రతిభావంతులైన చిన్నారులు మంచి పనిని కొనసాగిస్తూ భారత భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తారనే విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





