నిండుకుండలా సాగర్‌ జలాశయం

నల్గొండ, ప్రజాతంత్ర, జూలై 28: ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో నాగార్జునసాగర్‌ డ్యాం సోమవారం నిండుకుండను తలపిస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతోపాటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో క్రస్టు గేట్లను ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మంగళవారం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 583.8 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో గరిష్ఠంగా 312.05 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 293.97 టీఎంసీల నీరు ఉంది. మరో 18 టీఎంసీల నీరు వస్తే సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుతుంది. కాగా, శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *