పాలనలో ఏఐ ఉపయోగించాలి

– తెలంగాణ మొదటి రాష్ట్రంగా ఎదగాలి
– అందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి
– ఎంసీహెచ్‌ఆర్‌డీ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI)ను పరిపాలనలో పూర్తిస్థాయిలో ఉపయోగించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని, అందుకు తగిన విధంగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు అందరికీ శిక్షణ ఇవ్వాలని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగం(ఎంసీహెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌ శాంతికుమారికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీ గవర్నింగ్‌ బాడీ సబ్‌ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన కూడా అయిన భట్టి విక్రమార్క ప్రసంగించారు. చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన ఉన్నతాధికారి ఈ సంస్థకు అధిపతిగా ఉన్నారంటూ అధికారులు, సిబ్బంది వారి సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా పురోగతి సాధించాలని, అప్పుడే ఆశించిన స్థాయిలో సంస్థ ఎదుగుతుందని అన్నారు. సమావేశంలో మంత్రులు ఇచ్చిన సలహాలు పాటించాలన్నారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకారంతో పనిచేయడంపై శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగులకు సర్టిఫికెట్‌ సైతం ఇవ్వాలని ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు సూచించారు. న్యాక్‌ గుర్తింపు పొందేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు శిక్షణ ఇవ్వాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు సాధించేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల లీడర్లకు జిల్లాస్థాయిలో, మండల స్థాయిలో రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. గత పపదేళ్లు ఎంసీహెచ్‌ఆర్‌డీపై దృష్టి సారించలేదని, ఇకనుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్‌ కమిటీ సమావేశం అవుతుందని మంత్రులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అంశాల్లో మార్పులను దృష్టిలో పెట్టుకొని ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారులు సిబ్బందికి సైతం శిక్షణ ఇవ్వాలని, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలతో సంప్రదించే పరిస్థితి వచ్చినప్పుడు అందుకు తగిన విధంగా సిబ్బంది సిద్ధంగా ఉండాలని మంత్రులు సూచించారు. ఈ సంస్థ చరిత్ర, సంస్థలో ఉన్న లైబ్రరీ, ఆడిటోరియం, హాస్టల్‌ బిల్డింగ్స్‌ తదితర వసతులు, శిక్షణకు సంబంధించి ఎన్ని రాష్ట్రాలతో ఎంఓయూ కుదుర్చుకున్నది, ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగులకు ఎన్ని రోజులు శిక్షణ ఇచ్చింది, శిక్షణలో మెరుగైన పద్ధతుల కోసం చేపడుతున్న చర్యలు, బడ్జెట్‌ తదితర అంశాలను సంస్థ డైరెక్టర్‌ జనరల్‌, వైస్‌ చైర్మన్‌ శాంతికుమారి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రులకు వివరించారు. కమిటీ సభ్యులు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *