అబద్ధాలతో, ప్రగల్భాలతో మూసీ అభివృద్ధి!!

 “మూసీ అభివృద్ధి భాగస్వాములతో సమావేశం అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభావిత ప్రజలు లేరు. అంతర్జాతీయ, దేశీయ రుణదాతల కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, నగర ప్రణాళికావేత్తలు, భవన నిర్మాణ నిపుణులు, నిర్వాహకుల దృష్టిలో మేధావులు వగైరా ఎందరో ఉన్నారు గాని మూసీ అభివృద్ధి ఎవరికి అవసరమో ఆ ప్రజలు లేరు. మూసీ అభివృద్ధి పేరిట ఏ ప్రజాసమూహాలు నిర్వాసితులు కానున్నాయో ఆ సమూహాల ప్రతినిధులు లేరు. మూసీ అభివృద్ధి అని ఇరవై ఐదేళ్ల కింద చంద్రబాబు ప్రారంభించిన కార్యక్రమపు అసలు ఉద్దేశాలను ఎండగడుతూ, బాధిత ప్రజా సమూహాలను సంఘటితం చేసి, వారి హక్కుల కోసం పోరాడుతున్న ప్రధానమైన పౌరసమాజ సంస్థల కూటమి మూసీ బచావో ఆందోళన్ ప్రతినిధులు లేరు.”

గత శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం, స్వయంగా ముఖ్యమంత్రి మూసీ పునరుద్ధరణ ప్రణాళిక పేరుతో చేసిన ప్రసంగాలు, అభూత కల్పనల ప్రదర్శనలు వాస్తవంగా వారి లక్ష్యం ప్రజోపయోగం కాదని స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. సరిగ్గా ఇరవై ఐదేళ్ల కింద చంద్రబాబు నాయుడు విజన్ 2020 పేరుతో ఎటువంటి రంగుల కలలు అమ్మడానికి, అమాయకులను మాయ చేయడానికి ప్రయత్నించారో, అదే విధంగా ఈ మార్చ్ 13 మూసీ పునరుద్ధరణ ప్రదర్శన జరిగింది.

‘మూసీ పునరుజ్జీవంతో హైదరాబాదును మురిపిద్దాం’ అనే ఆకర్షణీయమైన పిలుపుతో, ఎప్పటికైనా హైదరాబాద్ మురిసిపోయే స్థితి వస్తుందో రాదో గాని, ఈ ప్రదర్శన అమాయక ప్రేక్షకులనైతే మురిపించి, రంగుల కలల్లో ముంచి తేల్చింది. మూసీ అభివృద్ధి భాగస్వాములతో సమావేశం అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభావిత ప్రజలు లేరు. అంతర్జాతీయ, దేశీయ రుణదాతల కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, నగర ప్రణాళికావేత్తలు, భవన నిర్మాణ నిపుణులు, నిర్వాహకుల దృష్టిలో మేధావులు వగైరా ఎందరో ఉన్నారు గాని మూసీ అభివృద్ధి ఎవరికి అవసరమో ఆ ప్రజలు లేరు. మూసీ అభివృద్ధి పేరిట ఏ ప్రజాసమూహాలు నిర్వాసితులు కానున్నాయో ఆ సమూహాల ప్రతినిధులు లేరు. మూసీ అభివృద్ధి అని ఇరవై ఐదేళ్ల కింద చంద్రబాబు ప్రారంభించిన కార్యక్రమపు అసలు ఉద్దేశాలను ఎండగడుతూ, బాధిత ప్రజా సమూహాలను సంఘటితం చేసి, వారి హక్కుల కోసం పోరాడుతున్న ప్రధానమైన పౌరసమాజ సంస్థల కూటమి మూసీ బచావో ఆందోళన్ ప్రతినిధులు లేరు.

“మూసీ పునరుద్ధరణ (మొదటి దశ) సవివర ప్రణాళికలు ఆవిష్కరిస్తున్న” ఈ సమావేశానికి రావలసిందిగా పర్యావరణవేత్త మేధా పాట్కర్ కు ఒక ఆహ్వానం అందింది. ఆమె అసలు ఈ సమావేశాన్ని రద్దు చెయ్యమని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులు రాహుల్ గాంధీకీ, జైరాం రమేష్ కూ, మీనాక్షీ నటరాజన్ కూ కూడా పంపారు.

మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి అందిన ఆహ్వానంలో, ఈ కార్యక్రమాన్ని “ప్రభావితవర్గాలతో, భాగస్వాములతో అర్థవంతమైన సంభాషణ”గా, “భాగస్వాముల చర్చల ముగింపు”గా పేర్కొన్నారని ఆమె రాశారు. కాని అట్టడుగున క్షేత్రంలో తప్పనిసరిగా వినవలసిన గళాలను ఈ చర్చల నుంచి మినహాయించారని ఆమె ఎత్తిచూపారు. ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నవారు, భూసేకరణ నోటీసులు అందుకున్నవారు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు, మూసీ జన్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు ఎవరికీ ఆహ్వానాలు పంపకపోవడం నిజమైన భాగస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం అని ఆమె అన్నారు. ఒకవైపు ఈ పరిణామం వల్ల ప్రభావితులవుతున్న ప్రజలను వదిలివేసి, ఉన్నతవర్గాల సంభాషణ జరపడాన్ని ఆమె తప్పు పట్టారు.

“సరిగ్గా విజన్ 2020 ఎట్లాగైతే గ్రాఫిక్ డిజైన్లతో అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టిందో, అట్లాగే మార్చ్ 13 ప్రదర్శన కూడా మూసీ నదికి ఒక పక్క బహు అంతస్తుల ఆకాశ హర్మ్యాలు, మూసీ నదిలో క్రూయిజ్ లు, మూసీ నది మీద అందమైన వంతెనలు, మరొక పక్క ఉద్యానవనాలు, ఆరు లేన్ల రహదార్లు ప్రదర్శించారు. గాంధీ విగ్రహాన్ని, దాని చుట్టూ ఉద్యానవనాన్ని, భారీ రంగుల రాట్నాన్ని కూడా ప్రదర్శించారు. “మూసీలో లాహిరి లాహిరి లాహిరిలో” అని పత్రికలు పరవశించిపోయాయి. ఇరవై ఐదేళ్ల కింద చంద్రబాబు ప్రకటించిన అబద్ధాల రంగుల కలల నాటికి సాధారణ గ్రాఫిక్ డిజైనింగ్ మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో మరింత పెద్ద అబద్ధాలతో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపే ఇంద్రజాల మహేంద్రజాల విద్య వచ్చింది.”

దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇటువంటి నదీ తీర అభివృద్ధి ప్రణాళికలు అన్నిచోట్లా ప్రతికూల సామాజిక పర్యావరణ ప్రభావాలు చూపుతున్నాయని ఆమె అన్నారు. సరిగ్గా అదే విధంగా మూసీ ప్రాజెక్టు కూడా పట్టణ నిరుపేద శ్రామికులను, మధ్యతరగతిని, విశ్రాంత ఉద్యోగులను, వేలాది కుటుంబాలను నిర్వాసితులను చేయబోతున్నదని ఆమె అన్నారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరుతో 2026 ఫిబ్రవరి 11న బండ్లగూడ జాగీర్ లో 10.34 ఎకరాల్లో ఉన్న మధ్యతరగతి గృహస్తులను ఖాలీ  చేయాలని నోటీసులు ఇవ్వడం, అదే సమయంలో రంగారెడ్డి జిల్లాలో మరొక 43.48 ఎకరాల భూసేకరణ నోటీసులు, కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ భూమి నుంచి 98.20 ఎకరాలు ఇవ్వాలని విజ్ఞప్తులు అన్నీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని, పైగా ఈ పనులన్నీ ఎటువంటి ప్రజల ప్రజాస్వామిక భాగస్వామ్యం లేకుండా, చట్టపరమైన రక్షణలకు, హామీలకు లెక్క లేకుండా జరుగుతున్నాయని ఆమె అన్నారు.

మన పర్యావరణ వ్యవస్థలో నదుల పాత్ర అసామాన్యమైనది గనుక తప్పనిసరిగా దేశంలో ప్రతి నదినీ పునరుద్ధరించవలసిన అవసరం ఉన్నదని ఆమె అంగీకరించారు. కాని మూసీలో విపరీతంగా ఉన్న విషపూరితమైన పారిశ్రామిక కాలుష్యం, నగరంలో పెద్ద ఎత్తున జరిగిన భూదురాక్రమణలు వంటి సమస్యలు పట్టించుకోకుండా ఆ పని జరగగూడదని ఆమె అన్నారు. నిర్వాసితత్వాన్ని తగ్గించేలా, ప్రజల గృహవసతి, జీవనోపాధి ధ్వంసం కాకుండా నదీ తీర అభివృద్ధి జరగాలని ఆమె అన్నారు. అంటే 2013 భూసేకరణ చట్టాన్ని కచ్చితంగా పాటించాలని ఆమె అన్నారు. ఆ చట్టం చాలా ప్రగతిశీలమైనది, ప్రజా ప్రయోజనకరమైనది కాగా, 2017లో తెలంగాణ ప్రభుత్వం ఆ చట్టానికి తెచ్చిన అన్యాయమైన సవరణ సామాజిక ప్రభావ మదింపు ప్రక్రియను, ఆహార భద్రతా నిబంధనలను తొలగించి, దాన్ని పలుచబార్చిందని ఆమె గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన ఆ అన్యాయమైన సవరణలను రద్దు చేసే బదులు, ఈ ప్రభుత్వం ఆ సవరణను బలోపేతం చేయడం కాంగ్రెస్ చేసిన వాగ్దానాలనుంచి వెనక్కిపోవడమే అని ఆమె అన్నారు.

అందువల్ల ఈ సమావేశాన్ని రద్దు చేయాలని, దాని బదులు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) ముసాయిదాను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలలో విడుదల చేసి, ప్రభావిత ప్రజలందరూ సూచనలు, సలహాలు ఇవ్వడానికి అరవై రోజుల సమయం ఇవ్వాలని ఆమె కోరారు. బాధిత సమూహాలతో బహిరంగ ప్రజా విచారణలు జరపాలనీ, మూసీ ప్రాజెక్టు సమీక్ష కోసం ఒక స్వతంత్ర కమిటీని నియమించాలనీ, ఈ ప్రాజెక్టు కోసం ఇచ్చిన భూసేకరణ నోటీసులన్నీ వెనక్కి తీసుకోవాలనీ, 2013 భూసేకరణ చట్టానికి 2017లో బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన సవరణను రద్దు చేస్తూ చట్టం తేవాలనీ ఆమె కోరారు.

ఈ ప్రజాప్రయోజనకర, సముచిత సలహాను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం యథాప్రకారం సమావేశం జరిపింది. “మూసీని ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు”, “నల్గొండ ప్రజల మేలుకోసమే మూసీ ప్రక్షాళన”, “పదివేల బాధిత కుటుంబాలకు ఎటువంటి పరిహారం ఇద్దామో చెప్పండి” వంటి మెరమెచ్చు మాటలతో బురిడీ కొట్టించే ప్రయత్నం జరిగింది. సరిగ్గా విజన్ 2020 ఎట్లాగైతే గ్రాఫిక్ డిజైన్లతో అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టిందో, అట్లాగే మార్చ్ 13 ప్రదర్శన కూడా మూసీ నదికి ఒక పక్క బహు అంతస్తుల ఆకాశ హర్మ్యాలు, మూసీ నదిలో క్రూయిజ్ లు, మూసీ నది మీద అందమైన వంతెనలు, మరొక పక్క ఉద్యానవనాలు, ఆరు లేన్ల రహదార్లు ప్రదర్శించారు. గాంధీ విగ్రహాన్ని, దాని చుట్టూ ఉద్యానవనాన్ని, భారీ రంగుల రాట్నాన్ని కూడా ప్రదర్శించారు. “మూసీలో లాహిరి లాహిరి లాహిరిలో” అని పత్రికలు పరవశించిపోయాయి. ఇరవై ఐదేళ్ల కింద చంద్రబాబు ప్రకటించిన అబద్ధాల రంగుల కలల నాటికి సాధారణ గ్రాఫిక్ డిజైనింగ్ మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో మరింత పెద్ద అబద్ధాలతో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపే ఇంద్రజాల మహేంద్రజాల విద్య వచ్చింది.

కళ్లు మిరుమిట్లు గొలిపే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చిత్రాలు ఆలోచనాశక్తిని తాత్కాలికంగా మొద్దుబార్చగలవేమో గాని, ప్రశాంతంగానైనా వాస్తవంగా ఏమి జరగనుందో ఆలోచించాలి. గతంలో చేసిన వాగ్దానాలను అమలు పరచడంలో ఈ పాలకుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమిటో పరిశీలించాలి. గ్రాఫిక్స్ కలలు తయారు చేస్తున్నవారికి కూడా ఇంకో ఏడాది, రెండేళ్లకు అవి గుర్తు ఉండవు గాని, ఆ కలల్లో పదో వంతు నిజమైనా ప్రజలకు ఒరిగేదేమిటో ఆలోచించాలి. అన్ని దినపత్రికలూ ప్రముఖంగా అచ్చువేసిన, అన్ని ఛానళ్లూ విధేయంగా చూపిన ఆ గ్రాఫిక్స్ చిత్రాలను విశ్లేషించి, అందులో శతాంశమైనా నిజం అయ్యే అవకాశం ఉందా పరిశీలించాలి.

మూసీలో క్రూయిజ్ లు నిలవడం, ప్రయాణించడం ఎప్పటికైనా అసాధ్యం. ఎంత చిన్న, తేలికపాటి క్రూయిజ్ నీటి మీద ప్రయాణించాలన్నా, పది పన్నెండు అడుగుల లోతు నీరు స్థిరంగా ఉండడమో, ప్రవహిస్తూ ఉండడమో జరగాలి. గోదావరి నీరు తెచ్చినా అది జరగదు. చెక్ డామ్స్ కడితే అంత నీటిని నిలిపి ఉంచడం సాధ్యమవుతుందేమో గాని, మరి అది పాలకులు చెపుతున్నట్టుగా దిగువ ప్రాంతాలకు మేలు చేయదు. నది ప్రారంభమయిన అనంతగిరి నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల దాకా నీటి ప్రవాహాన్ని అడ్డుకునే భవనాలు, నిర్మాణాలు, ఫామ్ హౌజులు ఇప్పటికే అక్కడ నీరు లేకుండా చేశాయి. ఇక ఆ రెండు జలాశయాల కింద మూసీ ప్రవాహమంతా నగరపు గృహ, మానవ వ్యర్థ జలాలే. లేదా పారిశ్రామిక వ్యర్థ జలాలే. ఈ జలాలను శుద్ధి చేయడానికి సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్ టి పి), ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఇటిపి) విరివిగా కావాలి. లేదా పరిశ్రమలను మూసీ పరీవాహక ప్రాంతం నుంచి ఇతర చోట్లకు తరలించాలి. ఇప్పటికైతే మొత్తం ఎస్ టి పి ల గురించే మాట్లాడుతున్నారు గాని, ఇటిపిల మాటే లేదు. మనుషుల తరలింపు గురించి మాట్లాడుతున్నారు గాని పరిశ్రమల తరలింపు గురించి మాట లేదు. ఎస్ టి పిల విషయానికే వస్తే ప్రస్తుతం నగరంలో రోజుకు 165 కోట్ల లీటర్ల నుంచి 195 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు ప్రవహిస్తుండగా, ఇప్పటికే ఉన్న 25 ఎస్ టి పి లలో 72 కోట్ల లీటర్ల జలాలు శుద్ధి అవుతున్నాయి. అంటే సగం వ్యర్థ జలాల శుద్ధి కూడా జరగడం లేదు. 2019లో ఉన్న ఎస్ టి పి ల సంఖ్య, వాటి సామర్థ్యం ఆరు సంవత్సరాల తర్వాత దాదాపు యథాతథంగా ఉంది. అప్పుడు ప్రతిపాదించిన 21 కొత్త ఎస్ టి పిలలో ఆరు సంవత్సరాలు గడిచాక చూస్తే ఐదు కూడా పూర్తి కాలేదు.

అంటే మూసీ సుందరీకరణ, క్షాళన, క్రూయిజ్ లలో లాహిరి లాహిరి అన్నీ అబద్ధం. గృహస్తులనుంచీ, సాముదాయక వనరుల నుంచీ భూమి లాక్కోవడం మాత్రం నిజం. అధికారిక అంచనాల ప్రకారమే పదివేల నిర్మాణాలు (కొందరు పదివేల కుటుంబాలు అంటున్నారు. కాదు. గెజిట్ లో నిర్మాణాలు అన్నారు. అంటే ఒక అయిదంతస్తుల నిర్మాణంలోనే కనీసం నలబై కుటుంబాలు కూడా ఉండవచ్చు), కనీసం యాబై వేల నుంచి లక్ష కుటుంబాలు నిర్వాసితులు కావడం నిజం. నిర్వాసితత్వం అందరికీ సమానమే అయినా, పునరావాసంలో వర్గం పని చేస్తుంది. ఎగువ మధ్యతరగతి సులభంగా పునరావాసం పొందవచ్చు, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలు బిచ్చగాళ్లయి, దిక్కులేక రోడ్ల మీద పడడం నిజం. అంత జరగబోతుంది, ఇంత జరగబోతుంది అని ఊదరగొట్టడంతో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోవడం మాత్రం నిజం. రియల్ ఎస్టేట్ వ్యాపారుల, కాంట్రాక్టర్ల గల్లాలు నిండడం, ఆ గల్లాల నుంచి ఎంతో కొంత రాజకీయ నాయకులకు అందడం నిజం.

మూసీ సుందరీకరణ నిజానిజాలు, ప్రగల్భాలు ఎలా ఉన్నా, మూసీ క్షాళన జరగడం ప్రజల అవసరం. మూసీని జీవనదిగా పునరుద్ధరించాలని ప్రజలు తప్పనిసరిగా ఉద్యమించవలసిందే. పారిశ్రామిక కాలుష్యాన్ని రద్దు చేసే, శుద్ధి చేసే చర్యలు, గృహ, మానవ కాలుష్యాన్ని శుద్ధిచేసే చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, గోదావరి జలాలను మూసీలో నింపడం తప్పనిసరిగా అవసరమే. ఆ అభివృద్ధి అంతా ప్రజల కోసం. కనుక ప్రజల నిర్వాసితత్వాన్ని వీలైనంత తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో సముచితమైన నష్టపరిహారం ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ నదీ తీర అభివృద్ధికి దేశదేశాల సంపన్నుల విలాసాలు, పర్యాటక రంగ అభివృద్ధి, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల బొక్కసాలు, రాజకీయ నాయకుల ముడుపులు అనే అర్థం చెప్పగూడదు. మూసీ అనంతగిరి నుంచి వాడపల్లి దాకా తెలంగాణ ప్రజలది. మూసీ అభివృద్ధి ఆ ప్రజల కోసం మాత్రమే జరగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *