– నీటి వనరుల పరిరక్షణలో రోల్ మోడల్‌గా తెలంగాణ
– ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది
– ఐటీపీఐ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 23: ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరు కావాలనే అడ్డుపడుతుండడం సాధారణమని, మూసీ (Musi river) విషయంలోనూ ఇదే జరుగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భావి తరాల కోసం మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని, ఆ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. నీటి వనరుల పరిరక్షణలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణను రోల్ మోడల్‌గా నిలుపుతామన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ) తెలంగాణ స్టేట్ రీజినల్ చాప్టర్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని పార్క్ హయాత్ హోటల్‌లో పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టువార్డ్స్ బయోఫిలిక్ అర్బనిజం (policies and strategies towards biophilic urbanism) అనే అంశంపై శనివారం ఏర్పాటు చేసిన సౌత్ జోన్ కాన్ఫరెన్స్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాల అభివృద్ధికి సరైన ప్రణాళికే పునాది అని అన్నారు. పర్యావరణం, సుస్థిరత లేకుండా ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదన్నారు. భవనాలను నిర్మించడమే అభివృద్ధి కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణతో కూడిన వృద్ధి ఆవశ్యకమని అని పేర్కొన్నారు. మనం రూపొందించే ప్రతి విధానం, కాపాడే ప్రతి అడవి, పునరుద్ధరించే ప్రతి నది, సృష్టించే ప్రతి జీవనోపాధి.. ఇవన్నీ తరాల మధ్య న్యాయానికి సంకేతాలని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, కార్బన్ అండ్ న్యూట్రల్ గ్రోత్, జల సంరక్షణ, సుస్థిర రవాణాలో తెలంగాణ అవలంబిస్తున్న విధానాలు, తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటే సుస్థిరాభివృద్ధితో కూడిన నగరాలను అభివృద్ధి చేయొచ్చన్నారు. వాతావరణ మార్పులు, పట్టణ వరదలు, పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలాల తరుగుదల, పట్టణీకరణ, తరిగిపోతున్న పచ్చదనం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నగర ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీపీఐ ప్రెసిడెంట్ ఎన్.కె.పటేల్, సెక్రటరీ జనరల్ కుల్ శ్రేష్ఠ, కో ఆర్డినేటర్(టెక్నో అడ్మిన్) ప్రదీప్ కుమార్, ఐటీపీఐ అండ్ తెలంగాణ రీజినల్ చాప్టర్ చైర్మన్ ఎస్.దేవేందర్ రెడ్డి, కార్యదర్శి కె.మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





