– పనుల ప్రగతిని పరిశీలిస్తున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల.
– నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రజా ప్రభుత్వం
– వరంగల్ ‘నిట్’ నిపుణులతో నాణ్యతా పరీక్షలు
– రెండు వైపులా సర్వీసు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ
ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: ఖమ్మం నగర ప్రజల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.525.36 కోట్లతో మున్నేరుకు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెటింగ్, వర్తక, వ్యాపార రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం అగ్రగామిగా నిలుస్తున్నది. అయితే ఖమ్మం నగరం మధ్యగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు ఏటా వర్షాకాలంలో ఉధ్రుతంగా పొంగి పరిసర ప్రాంతాల ఇండ్లు, వ్యాపార సంస్థలు, పంటలు ముంపునకు గురవుతున్నాయి. ప్రభుత్వ మౌలిక వసతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతున్నది. వందలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడుతున్నాయి. రోడ్లు, విద్యుత్ స్తంబాలు, సబ్ స్టేషన్లు, పాఠశాల భవనాలు, తాగునీటి వసతులు, పైపు లైన్లు, ఆరోగ్య కేంద్రాలు దెబ్బతింటున్నాయి. రూరల్ మండలంలో పంటలు ముంపునకు గురవుతున్నాయి. 2024 సెప్టెంబర్‌లో సంభవించిన క్లౌడ్ బరస్ట్‌తో మున్నేరుకు వచ్చిన ఆకస్మిక వరదతో ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు రూ.757 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మున్నేరు వాగు రివిట్మెంట్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్నేరు వాగుకు 5,863 చదరపు కి.మీ విస్తీర్ణం (క్యాచ్‌మెంట్ ఏరియా) నుండి గరిష్టంగా పది వేల క్యూమెక్స్ వరద ప్రవహిస్తుంది. ఖమ్మం నగరం మధ్య నుండి ప్రవహిస్తున్న మున్నేరుకు ఎడమ వైపు డ్రైనేజీ వ్యవస్థ ద్వారా 379 క్యూమెక్స్, కుడి వైపు డ్రైనేజీ వ్యవస్థ ద్వారా 605 క్యూమెక్స్ వరద విడుదలవుతుంది. పరివాహక ప్రాంతం, నగరం నుంచి వచ్చే వరద గరిష్టస్థాయిని దృష్టిలో ఉంచుకుని, మున్నేరు వాగుకు రెండు వైపులా కాంక్రీట్ రక్షణ గోడ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది.
మున్నేరు వరద సమస్యకు శాశ్వత పరష్కారానికి ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రూ.525.36 కోట్లతో వాగుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులను 2024 మార్చిలో ప్రారంభించారు. వాగుకు రెండు వైపులా ఖమ్మం రూరల్ మండలంలో 8.5 కి.మీ, ఖమ్మం అర్బన్ మండలంలో 8.5 కి.మీ మొత్తం 17 కి.మీ పొడవున 10-15 మీటర్ల ఎత్తున రిటైనింగ్ వాల్‌తోపాటు, సర్వీసు రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ సదుపాయంతో ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. నాణ్యతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. వరంగల్ ‘నిట్’ నిపుణులతో పనుల ప్రమాణాలను తనిఖీ చేయిస్తున్నది. పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నారు. ఖమ్మం అర్బన్ మండలంలో మల్లెమడుగు, దానవాయిగూడెం, బుర్హాన్‌పురం, ఖమ్మం గ్రామాలు, ఖమ్మం రూరల్ మండలంలో పోలేపల్లి, గొల్లపాడు, గుడిమల్ల, గుర్రాలపాడు, ఏదులాపురం గ్రామాలకు చెందిన మొత్తం 245.12 ఎకరాల భూసేకరణలో 106.21 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. 138.31 ఎకరాల పట్టా భూమిలో ఇప్పటివరకు 69.12 ఎకరాలను సేకరించారు. భూ సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. నిర్వాసితులకు పరిహారంతోపాటు, ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో 139.27 ఎకరాల్లో లే-అవుట్‌ను ప్రభుత్వం అభివృద్ది చేస్తున్నది. ఇందులో 1,666 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించనున్నారు. అన్ని మౌలిక వసతులతో మోడల్ కాలనీగా ఇది అభివృద్ధి చెందుతుంది. మున్నేరు రిటైనింగ్ వాల్ పనులు పూర్తయితే ఖమ్మం పురోభివృద్ధికి మైలు రాయిగా నిలుస్తుంది. దశాబ్దాల సమస్యను పరిష్కరించిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





