రాష్ట్రంలో నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్
– 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో..
– బరిలో మొత్తం 12,930 మంది అభ్యర్థులు
– భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
– అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భద్రత
– మక్తల్‌లో అభ్యర్థి ఆత్మహత్య.. 6వ వార్డు ఎన్నిక వాయిదా
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలకంటే అధిక పోలింగ్ శాతం నమోదయ్యేందుకు ఎన్నికల సంఘం వివిధ మీడియాల ద్వారా ప్రచారం నిర్వహించింది. నారాయణపేట్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవ్ ఆత్మహత్యతో ఆ వార్డు ఎన్నికను వాయిదా వేసింది. ఎన్నికల సిబ్బంది తమ సరంజామాతో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ పక్రియ ప్రారంభంకానున్నది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,301 బాలెట్ బాక్సులను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. 13న ఓట్ల లెక్కింపుతో ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ రోజు నగర, పట్టణ ప్రజానీకం ఎవరి వైపు మొగ్గు చూపిందనే ఉత్కంఠకు తెరపడనున్నది. జిల్లాలవారీగా ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు మంగళవారం తరలించారు. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు వాహనాల్లో వెళ్లారు. ఎన్నికలు జరిగే పురపాలికల్లో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులు, పత్రాలను పోలీస్ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు తరలించారు. అక్కడినుంచి ప్రతి పోలింగ్ కేంద్రానికి మంగళవారం తరలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అకడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పోలింగ్ పక్రియ కోసం సిబ్బంది నియామకం, వారికి అందించిన శిక్షణపై సమీక్షించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డీజీపీ కూడా పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
రెండ్రోజుల సెలవులకు తోడు కలిసి వచ్చిన శని, ఆదివారాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేలు స్కూళ్లలో చదివే విద్యార్థులకు వరుస సెలవులు వచ్చాయి. అయితే కొన్ని జిల్లాలో మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. రాష్ట్రంలో బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు ఆయా ప్రాంతాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగిన ప్రాంతాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 13వ తేదీ ఓట్ల లెక్కింపు పక్రియ జరగనుంది. కౌంటింగ్ నిర్వహించే స్కూళ్లకు శుక్రవారం అధికారులు సెలవులు ప్రకటించారు. ఆ మరుసటి రోజు అంటే 14న రెండో శనివారం, 15న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. మొత్తంగా ఈ వారంలో నాలుగు రోజులుపాటు సెలవులు వచ్చాయి.
ఎన్నికల ప్రాంతాల్లో షాపులు, పరిశ్రమలకు సెలవు
మున్సిపల్ పోలింగ్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని షాపులు, పరిశ్రమలకు బుధవారం సెలవు వర్తించనుంది. అంతేకాÅ£ మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కూడా ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




