ముంబై తొలి తెలుగు కవి ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లు

సొంతూరిలో ఉపాధి కరువై 1920లో, కుక్కునూరు నుండి ముంబైకి వలస వచ్చిన ద్యావరిశెట్టి గంగారాం, గంగూబాయి దంపతులకు 23 ఆగస్ట్ 1932 లో జన్మించిన ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లుకు పేదరికం వారసత్వంగా లభించింది. కానీ, ఆయన పేదరికంలోనే మగ్గిపోలేదు. బాల్యం నుండిజీవితాన్ని పోరాటానికి అంకితం చేసి, గెలిచి, ఉన్నత శిఖరాలు అధిరోహించి నేటి యువతకు ఆదర్శప్రాయుడయ్యారు. బోయవాడు స్వయంకృషి తో వాల్మీకిగా మారినట్టు, ఆకలి, అవమానాలు, పేదరికం అడుగడుగునా అణిచివేస్తున్నా, చెదరక బెదరక ముంబై తొలి తెలుగు కవిగా ఎదిగిన తీరు, ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు’  అనే నానుడికి ప్రత్యక్ష తార్కాణంగా చెప్పొచ్చు.
డిలాయిల్ రోడ్ మున్సిపల్ స్కూల్లో ఒకటవ తరగతి చదువుతూ, పేదరికం వల్ల చదువు ఆపేసి బాల కార్మికుడిగా మారిపోయారు. తన ఎనిమిదవ ఏట నుండి బీడీలు చుట్టడంలో తల్లికి సహాయం చేసేవారు. రోజుకు 14 గంటలు బీడీలు చుట్టి తండ్రి సంపాదనకు ఇతోధికంగా సహాయపడేవారు. కానీ, వేంకటేశ్వర్లులోని జ్ఞానతృష్ణ ఆరిపోలేదు. చదువుపై ఆసక్తి తగ్గిపోలేదు. తన 13వ ఏట మళ్ళీ కొత్తగా విద్యాభ్యాసం ఆరంభించారు. తన ఇంటి పక్కనే ఉన్న రాత్రి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చేరిపోయారు. నాలుగేండ్లలో ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు సాధించారు.
ముంబైలో తెలుగు భాషా వికాసం కోసం పడిగెల గ్రామ పట్వారి హన్మంతరావుగారు, (ముంబైలో ఆజాద్ బీడీ కంపెనీ పార్టనర్) సంస్కృతాంధ్రాంగ్ల పండితుడైన టి.నరసింహశాస్త్రిగారిని ముంబైకి పంపించారు. ద్యావరిశెట్టి వెంకటేశ్వర్లు నరసింహశాస్త్రిగారి వద్ద తెలుగును నేర్చుకున్నారు. శాస్త్రిగారి చొరవతో కమాటిపురాలో 1949లో ఆంధ్ర సారస్వత పరిషద్ – ముంబై విభాగాన్ని ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర్లు కూడా శాస్త్రిగారితో పాటు పరిషద్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తన పద్దెనిమిదవ ఏట పరిషద్‌కు సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
అంతేగాకుండా, తన పదహారవ ఏట నుండి సయానీరోడ్‌లో రెండు గదులు అద్దెకు తీసుకుని, ఉచితంగా మిల్లు కార్మికులకు, వారి పిల్లలకు తెలుగు బోధనకు శ్రీకారం చుట్టారు వెంకటేశ్వర్లు. తను నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పుతూ ముంబైలో తెలుగు భాషావికాసానికి వేంకటేశ్వర్లు వేగాన్ని తీసుకొచ్చారు. ఆంధ్ర సారస్వత పరిషద్ని ర్వహించిన ఒక కార్యక్రమానికి దాశరథి  కృష్ణమాచార్యులు ముంబైకి వచ్చినప్పుడు ఆయన పాడిన పద్యాలు, పాటలు ద్యావరిశెట్టిని విపరీతంగా ఆకర్షించాయి.
ఏదేమైనా తాను కూడా దాశరథిగారి లాగే కవిగా గుర్తింపు పొందాలనే పట్టుదల ఆయనలో మొదలైంది. తన అభిప్రాయాన్ని నరసింహశాస్త్రిగారికి చెప్పినప్పుడు ఆయన ‘కవిగా మారాలంటే బాగా చదవాలి..’  అని సలహా ఇచ్చారు. అప్పట్నుండి వెంకటేశ్వర్లు తెలుగు సాహిత్యాన్ని వదలకుండా చదవడం మొదలెట్టారు. చదువుతూ, చదువుతూ రాయడం కూడా మొదలెట్టారు.
1952లో మొదటి గ్రంథం ‘శ్రీ వెంకటేశ శతకము’ పూర్తయింది. కానీ, భాషా దోషాలు, ఛందోబద్ధ లోపాల గురించి దడగా ఉండేది. అప్పుడే పశ్చిమ గోదావరికి చెందిన మఠం వాసుదేవమూర్తి గారు ఉద్యోగరీత్యా ముంబైకి వచ్చారు. ఆయన సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిష్ణాతులు. తన రచనను వెంకటేశ్వర్లు వాసుదేవమూర్తిగారికి చూపించారు. వెంకటేశ్వర్లు భాషాపటిమకి ఆయన ముగ్దులయ్యారు. దాంతో ఆ పుస్తకం 1953లో ప్రచురణ జరిగింది. సికింద్రాబాద్‌లోని సామల గంగారెడ్డికి చెందిన భారత్ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించారు.
సయానీ రోడ్‌లో తెలుగు బోధన కార్యక్రమాలు చేస్తూనే, తిరుపతికి చెందిన పసుపులేటి నాగరాజులు, వంగ సోమలింగం లాంటి కొందరు మిత్రులను కలుపుకొని ఖేడ్‌గల్లీలో ‘వివేకగ్రంథాలయం’ స్థాపించారు. ముంబైలో ఇప్పుడా గ్రంథాలయం తెలుగువారికి చెందిన అతిపెద్ద గ్రంథాలయంగా భాసిల్లుతోంది. ముంబై తెలుగువారికి గర్వకారకులైన సోమంచి యజ్ఞన్నశాస్త్రి, మఠం వాసుదేవమూర్తిలాంటి మహామహులు ఆ గ్రంథాలయానికి అధ్యక్షులు”గా సేవలందించారు. ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లు గ్రంథాలయంలో పలు పదవుల్లో సేవలందిస్తూ, గ్రంథాలయం ఆధ్వర్యంలో సాందీపని రాత్రి విద్యాలయం, వివేకా బాల్‌వాడి లాంటి వాటి ఏర్పాటుకు ఎంతో సహకరించారు. భూరీ విరాళాలు అందించారు.
అప్పటికే కవిగా కూడా వేంకటేశ్వర్లు ముంబై నగరంలో పేరుపొందారు. 1954లో ‘అ నుండి ఱ’ వరకు ఉన్న తెలుగు అక్షరాలతో ఆరంభించి, ‘అక్షరమాల’ అనే మరో పద్యపుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకానికి శతావధాని కృష్ణమాచార్యులు ముందు మాట రాశారు. ఈ పుస్తకం కూడా సికింద్రాబాద్‌లోనే అచ్చయింది. ద్యావరిశెట్టి వెంకటేశ్వర్లు బహు ముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యపరంగా, సామాజికంగా తన వంతు సేవలు అందిస్తూనే, మరోవైపు వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. సాహిత్యంలో తొలి కవిగా గుర్తింపబడ్డారు. ఆధునిక యంత్రాలలో ప్రభాత్ ఇంజినీరింగ్ వర్క్స్ అనే ప్యాక్టరీ స్థాపించి తొలి తెలుగు పారిశ్రామికవేత్తగా కూడా చరిత్రకెక్కారు. అంతకు ముందు తెలుగువారు బీడీల కంపెనీలు, బిల్డింగ్ నిర్మాణాల్లో మాత్రమే ఎక్కువగా నిమగ్నమై ఉండేవారు.
అంతేగాకుండా, ముంబై తెలుగువారి చరిత్రలో మొదటిసారిగా లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రభాదేవికి అధ్యక్షుడిగా కూడా ఎన్నికై తన గౌరవప్రదమైన జీవిత చరిత్రలో మరో ‘తొలి’ ని చేర్చుకున్నారు. బతుకుదెరువు కోసం బీడీల వ్యాపారం నుండి బొగ్గుల వ్యాపారం, కిరాణం వ్యాపారం, కిరోసిన్ వ్యాపారం, వస్త్ర వ్యాపారం లాంటివెన్నో నిర్వహించి చివరకు ప్రభాత్ ఇంజినీరింగ్ వర్క్స్‌లో స్థిరపడ్డారు. రాజకీయ రంగంలో కూడా ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లు చురుకుగా పాల్గొన్నారు. 1962 నుండే ఆయన కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉండేవారు. 1984 ఎన్నికల్లో  పోటీ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. 1985లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకున్నారు కానీ, ఆత్మాభిమానాన్ని చంపుకొని నాయకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగడం ఇష్టం లేక మానుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల జోలికి వెళ్ళలేదు.
ముంబైలో తెలుగు పాఠశాలల ఏర్పాటుకు, తెలుగు పాఠ్యపుస్తకాల ప్రచురణకు ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లు ఎంతో కృషి చేశారు. వేదాంత రహస్యాలను తెలిపే ‘మనస్సును వశపరుచుకునుటకు కొన్ని ఉపాయములు’, ‘శ్రీ మార్కండేయ మహర్షి భవిష్యవాణి’, ‘ముంబాయి దర్శిని’, ‘ముంబయి జలప్రళయం’ అనే పుస్తకాల్ని వెలువరించారు. తన పేరు మీద ‘ద్యావరిశెట్టి వెంకటేశ్వర్లు సాహిత్య పురస్కారం’ ఏర్పాటు చేసి ఎందరో సాహితీవేత్తలకు పురస్కారాలు అందించారు. వలస వేదనలెన్నున్నా, ఉన్నత లక్ష్యాలతో, పక్కా ప్రణాళికలతో ముందుకు వెళితే అనుకున్నది సాధించవచ్చు అనే దానికి ప్రత్యక్ష తార్కాణమైన ద్యావరిశెట్టి వెంకటేశ్వర్లు 5, ఆగస్ట్ 2013లో పరమపదించారు. ఆయనకు నివాళులు..!
– సంగెవేని రవీంద్ర 
– 998745310

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *