“తెలంగాణ పీపుల్స్ జాయింట్ ఆక్షన్ కమిటీ, రైతు స్వరాజ్య వేదిక, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, ప్రగతిశీల మహిళా సంఘం వంటి పౌర సంఘాల ప్రతినిధి బృందం మోమిన్ పేట మండల గ్రామాలలో డిసెంబర్ 24న పర్యటించి ఇథనాల్ కంపెనీ గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పింది. దానితో ఇథనాల్ కార్ఖానా ప్రమాదాల గురించి చైతన్యవంతులైన ప్రజలు ఎటువంటి పరిస్థితిలోనూ దీన్ని రానివ్వగూడదని నిర్ణయించుకున్నారు. ప్రజాభిప్రాయం అంత విస్తృతంగా వ్యతిరేకంగా ఉండడంతో చివరికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలతో సహా, అన్ని రాజకీయ పార్టీల స్థానిక నాయకులకు కార్ఖానాను వ్యతిరేకించక తప్పలేదు.”
నూతన సంవత్సర శుభోదయం ఒక ఆహ్వానించచదగిన ఉత్తేజకర వార్తతో జరుగుతున్నది. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల కేంద్రంలో ప్రతిపాదించిన ఒక కాలుష్య కారక పరిశ్రమను ప్రజాభిప్రాయానికి తల ఒగ్గి విరమించుకుంటున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.
మోమిన్ పేటలో 10.33 ఎకరాల భూమిలో, వందకోట్ల రూపాయల పెట్టుబడితో, రోజుకు అరవై వేల లీటర్ల ధాన్య ఆధారిత ఇథనాల్ తయారు చేయడానికి సువీర బయో ఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వేసిన ప్రణాళిక మీద డిసెంబర్ 30 మంగళవారం నాడు ప్రజాబిప్రాయ సేకరణ జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ప్రజలు, ప్రజా నాయకులు, అధికార కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజానుకూల శాస్త్రవేత్తలు, పౌరసంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు ముక్త కంఠంతో ఇథనాల్ ఫాక్టరీని వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ సమావేశపు వీడియో చూస్తే ప్రజల సృజనాత్మకత, ఆలోచన, ధిక్కారం స్పష్టంగా కనబడ్డాయి. ప్రజలందరూ ఐక్యంగా ప్రకటించిన ఆ అభిప్రాయానికి లోబడి తమ కంపెనీ ఆలోచనను విరమించుకుంటున్నామని కంపెనీ ప్రతినిధి ప్రకటించారు. ఇప్పటికైతే ప్రజలు విజయం సాధించారు. ఈ ప్రజా విజయం నిజమేనా, దొడ్డిదారిన కంపెనీ మళ్లీ ప్రవేశిస్తుందా వంటి సందేహాలు ఉండవచ్చు గాని, ఇప్పటికైతే వందలాది మంది గ్రామస్తుల ముందు, జిల్లా కలెక్టర్ తో సహా అనేక మంది ప్రభుత్వాధికారుల ముందు చేసిన ఈ ప్రకటనకు కంపెనీ కట్టుబడి ఉండక తప్పదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత కొంతకాలంగా ఇథనాల్ పరిశ్రమకు అనుకూల విధానాలు ప్రకటిస్తుండడంతో, ఒక్క తెలంగాణలోనే ముప్పై ఇథనాల్ కర్మాగారాలు నెలకొల్పడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇథనాల్ కర్మాగారం వల్ల జరగబోయే ప్రమాదాల గురించి స్పృహతో దాదాపు ప్రతిచోటా ప్రజల ఆందోళన కూడా దీటుగా మొదలయింది. ఆ పరిశ్రమకు చాలా ఎక్కువ నీరు అవసరం కావడంతో స్థానిక జలవనరులను, భూగర్భ జల వనరులను కొల్లగొట్టడం జరుగుతుందనీ, పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలతో జల కాలుష్యం, వాయు కాలుష్యం ప్రమాదాలు కూడా ఉన్నాయని పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. అయినా ప్రభుత్వాలు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మంత్రం జపిస్తున్నాయి గనుక, తెలంగాణ ప్రభుత్వం అసలు తెలంగాణ పేరునే ‘తెలంగాణ మీన్స్ బిజినెస్’ అని వ్యాపారమయంగా మార్చేసింది గనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ విషపూరిత పరిశ్రమకు మద్దతు తెలుపుతున్నది.
మోమిన్ పేట కర్మాగారానికి కూడా రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు ప్రాధికార సంస్థ 2025 ఫిబ్రవరి 23న ప్రాథమిక అనుమతి ఇచ్చింది. ఈ ప్రాథమిక అనుమతి ప్రకారం పర్యావరణ ప్రభావ మదింపు జరపవలసిన అంశాలను, విధివిధానాలను సూచిస్తారు. దాని ఆధారంగా పర్యావరణ నిర్వహణ ప్రణాళికను తయారు చేసుకుని, 2025 మార్చ్ నుంచి మే వరకూ పునాది స్థాయి పర్యావరణ అధ్యయనం జరిపామని పర్యావరణ ప్రభావ మదింపు నివేదికలో తెలిపారు. ఈ నివేదికను ప్రభుత్వానికీ, కంపెనీకి సంబంధం లేని స్వతంత్ర సంస్థ తయారు చేయాలి. కాని సాధారణంగా అటువంటి స్వతంత్ర సంస్థల నివేదికలను ఇటు ప్రభుత్వమూ, అటు కంపెనీ కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నివేదిక కూడా పూర్తిగా కంపెనీ ప్రయోజనాలకు అనుకూలంగా, తప్పుల తడకగా తయారయింది. రోజుకు అరవై వేల లీటర్ల ఇథనాల్ తయారు చేసే కర్మాగారం నుంచి వ్యర్థ జలాలు అసలు రానే రావని రాశారంటే ఈ నివేదిక ఎంత అబద్ధపు నివేదికో అర్థమవుతుంది.
“ఈ విధానం కింద ఇథనాల్ ఫాక్టరీలు పెట్టేవారికి, లేదా ఇథనాల్ ఫాక్టరీలు పెట్టి, నడపకపోయినా, పెడతామని కాగితాల మీద చూపేవారికి ప్రభుత్వం బియ్యం కిలో రు. 20 కి సబ్సిడీ కింద ఇస్తుంది. ఆ కంపెనీల యజమానులు అలా చౌకగా బియ్యం సంపాదించి, దాన్ని లాభానికి మార్కెట్లో అమ్ముకోవచ్చు. అది మాత్రమే కాదు, ఇథనాల్ కార్ఖానా పెడుతున్నామని చెప్పేవారికి ప్రభుత్వం ఆరు సంవత్సరాల పాటు వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇప్పిస్తుంది. అంటే ఇథనాల్ ఫాక్టరీ పెడతామని చెప్పి వంద కోట్లో, కొన్ని వందల కోట్లో వడ్డీ లేని బ్యాంకు రుణం తీసుకుని, ఆరు సంవత్సరాల పాటు దాన్ని అధిక వడ్డీ సంపాదించే ఇతర మార్గాలకు మళ్లించి లాభపడవచ్చు. ఈ అక్రమాలు చెయ్యకపోయినా, న్యాయంగానే ఫాక్టరీ పెట్టి, ఇథనాల్ తయారు చేసినా ఆ ఇథనాల్ ను ప్రభుత్వమే కొనడానికి ఒప్పందాలు చేసుకుంటుంది. ఆ ఒప్పందాల ప్రకారం ఇథనాల్ కంపెనీలకు స్థిరమైన రాబడి అందజేస్తుంది. అందుకే ఈ ఇథనాల్ పరిశ్రమ గురించి అధ్యయనం చేసినవారు ఇది సబ్సిడీల, రాయితీల పరిశ్రమే తప్ప ఇంధన పరిశ్రమ కాదని అంటున్నారు.”
చట్టబద్ధంగా నిర్వహించవలసిన ప్రజాభిప్రాయ సేకరణను కూడా అటువంటి దొంగ పర్యావరణ ప్రభావ మదింపు నివేదిక సహాయంతో తూతూమంత్రంగా డిసెంబర్ 30న నిర్వహించాలని ప్రభుత్వమూ, కంపెనీ భావించాయి. స్థానికులు చెపుతున్న ప్రకారం డిసెంబర్ 30న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం గురించి డిసెంబర్ 24 నాటికి కూడా స్థానిక ప్రజలకు సమాచారం లేదు. స్థానిక ప్రజా ప్రతినిధులకు, ఈ కర్మాగారం పరిధిలోకి వచ్చే గ్రామాల సర్పంచ్ లకు కూడా సమాచారం లేదు.
తెలంగాణ పీపుల్స్ జాయింట్ ఆక్షన్ కమిటీ, రైతు స్వరాజ్య వేదిక, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, ప్రగతిశీల మహిళా సంఘం వంటి పౌర సంఘాల ప్రతినిధి బృందం మోమిన్ పేట మండల గ్రామాలలో డిసెంబర్ 24న పర్యటించి ఇథనాల్ కంపెనీ గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పింది. దానితో ఇథనాల్ కార్ఖానా ప్రమాదాల గురించి చైతన్యవంతులైన ప్రజలు ఎటువంటి పరిస్థితిలోనూ దీన్ని రానివ్వగూడదని నిర్ణయించుకున్నారు. ప్రజాభిప్రాయం అంత విస్తృతంగా వ్యతిరేకంగా ఉండడంతో చివరికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలతో సహా, అన్ని రాజకీయ పార్టీల స్థానిక నాయకులకు కార్ఖానాను వ్యతిరేకించక తప్పలేదు.
ఇథనాల్ కర్మాగారం వల్ల ఫార్మాల్డిహైడ్, మెథనాల్ తో సహా విషపూరితమైన వాయువులు, రసాయనాలు వెలువడుతాయని, అందువల్ల భూమి, గాలి, నీరు కలుషితమవుతాయని స్థానికులు గుర్తించారు. భూగర్భ జలాలు కూడా కలుషితం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్య పీడితులవుతారనే అనుమానాలు బలపడ్డాయి. అరవై వేల లీటర్ల ఇథనాల్ తయారు చేయడానికి ప్రతిరోజూ దాదాపు మూడు లక్షల లీటర్ల నీళ్లు అవసరమవుతాయని, ఆ నీటిని కేవలం బోర్ల ద్వారా సమకూర్చుకున్నా, ఆ ప్రాంతం మొత్తం భూగర్భ జలాలు అడుగంటుతాయని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఒక లీటర్ ఇథనాల్ తయారు చేయాలంటే రెండుంబావు కిలోల బియ్యం కావాలి. అంటే ఈ కార్ఖానా రోజుకు లక్షన్నర కిలోల బియ్యాన్ని మింగేస్తుందని తెలిసింది. వ్యవసాయం తప్ప మరొక జీవనాధారం లేని ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటడమంటే వ్యవసాయం ధ్వంసం కావడమేనని, వేలాది మంది ప్రజల జీవన భద్రతకు ప్రమాదమని కూడా ప్రజలు తెలుసుకున్నారు. మొత్తంగా ఇటువంటి కర్మాగారం వల్ల ఆ గ్రామమూ, చుట్టుపక్కల ప్రాంతాలూ నివాసయోగ్యం కాకుండా పోతాయని శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు చేసిన హెచ్చరికలు, ఇచ్చిన శాస్త్రీయ వివరణలు ప్రజలకు ఆందోళన కలిగించాయి.
నిజానికి ఈ ఆందోళనలు కేవలం మోమిన్ పేట వాసులవి మాత్రమే కాదు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పాలన రోజుల నుంచీ ప్రణాళికలు రచిస్తున్న ముప్పైకి పైగా ఇథనాల్ కర్మాగారాల ప్రాంతాలలో ప్రజలందరూ ఈ ఆందోళనతోనే ఉన్నారు. అటువంటి ప్రజాందోళనల వల్లనే నిర్మాల్ జిల్లా దిలావర్ పూర్ లో ప్రతిపాదించిన ఇథనాల్ కర్మాగారం ప్రణాళిక రద్దు అయింది. జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడలో స్థాపించదలచిన ఇథనాల్ కర్మాగారం ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
“నిజానికి ఈ ఆందోళనలు కేవలం మోమిన్ పేట వాసులవి మాత్రమే కాదు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పాలన రోజుల నుంచీ ప్రణాళికలు రచిస్తున్న ముప్పైకి పైగా ఇథనాల్ కర్మాగారాల ప్రాంతాలలో ప్రజలందరూ ఈ ఆందోళనతోనే ఉన్నారు. అటువంటి ప్రజాందోళనల వల్లనే నిర్మాల్ జిల్లా దిలావర్ పూర్ లో ప్రతిపాదించిన ఇథనాల్ కర్మాగారం ప్రణాళిక రద్దు అయింది. జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడలో స్థాపించదలచిన ఇథనాల్ కర్మాగారం ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొని అక్కడి నుంచి వెళ్లిపోయింది.”
ఈ నేపథ్యంలో అసలు ఇంతగా ప్రజారోగ్యానికి, భద్రతకు హానికరమైన ఇథనాల్ పరిశ్రమను, అది కూడా పెద్దగా ఉద్యోగ కల్పన చేయని పరిశ్రమను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు ఎందుకు అనుకుంటున్నాయో ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్ డి ఏ ప్రభుత్వ 2021లో ‘ఇథనాల్ 20’ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. దాని ప్రకారం దేశంలో వినియోగిస్తున్న పెట్రోల్ లో 2025-26 నాటికి 20 శాతం ఇథనాల్ కలపాలని లక్ష్యం నిర్ణయించారు. ఇథనాల్ కలపడం ద్వారా పెట్రోల్ కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్ మీద ఖర్చవుతున్న విదేశీ మారక ద్రవ్యంలో కొంత భాగాన్ని ఆదా చేయడం ప్రభుత్వ ఉద్దేశం. అయితే పెట్రోల్ కాలుష్యం ఎంత తగ్గుతుందో, ఇథనాల్ కార్ఖానాల వల్ల కాలుష్యం దాదాపు అంతే జరుగుతుంది. ఇక రోజు రోజుకూ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న వాహనాల వల్ల, ప్రభుత్వమే, బ్యాంకులే ఇంకా ఇంకా ఎక్కువ వాహనాలు కొనుక్కొమ్మని ప్రోత్సహిస్తుండడం వల్ల ఇథనాల్ తో ఆదా చేయగలిగిన విదేశీ మారక ద్రవ్యానికీ, రోడ్ల మీదికి కొత్తగా వచ్చిన వాహనాలకు అవసరమయ్యే ఇంధనానికీ సరిపోతుంది. మొత్తానికి సున్నకు సున్నా హళ్లికి హళ్లి.
అలా ప్రకటిత సదుద్దేశాలు రద్దయిపోయిన తర్వాత, మరి మేలు ఎవరికి జరుగుతుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ విధానం కింద ఇథనాల్ ఫాక్టరీలు పెట్టేవారికి, లేదా ఇథనాల్ ఫాక్టరీలు పెట్టి, నడపకపోయినా, పెడతామని కాగితాల మీద చూపేవారికి ప్రభుత్వం బియ్యం కిలో రు. 20 కి సబ్సిడీ కింద ఇస్తుంది. ఆ కంపెనీల యజమానులు అలా చౌకగా బియ్యం సంపాదించి, దాన్ని లాభానికి మార్కెట్లో అమ్ముకోవచ్చు. అది మాత్రమే కాదు, ఇథనాల్ కార్ఖానా పెడుతున్నామని చెప్పేవారికి ప్రభుత్వం ఆరు సంవత్సరాల పాటు వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇప్పిస్తుంది. అంటే ఇథనాల్ ఫాక్టరీ పెడతామని చెప్పి వంద కోట్లో, కొన్ని వందల కోట్లో వడ్డీ లేని బ్యాంకు రుణం తీసుకుని, ఆరు సంవత్సరాల పాటు దాన్ని అధిక వడ్డీ సంపాదించే ఇతర మార్గాలకు మళ్లించి లాభపడవచ్చు. ఈ అక్రమాలు చెయ్యకపోయినా, న్యాయంగానే ఫాక్టరీ పెట్టి, ఇథనాల్ తయారు చేసినా ఆ ఇథనాల్ ను ప్రభుత్వమే కొనడానికి ఒప్పందాలు చేసుకుంటుంది. ఆ ఒప్పందాల ప్రకారం ఇథనాల్ కంపెనీలకు స్థిరమైన రాబడి అందజేస్తుంది. అందుకే ఈ ఇథనాల్ పరిశ్రమ గురించి అధ్యయనం చేసినవారు ఇది సబ్సిడీల, రాయితీల పరిశ్రమే తప్ప ఇంధన పరిశ్రమ కాదని అంటున్నారు. నిజానికి ఈ విధానంలో భాగంగా బహిరంగ విచారణ, ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియలను కూడా రద్దు చేయాలని ప్రభుత్వాలు భావించాయి. అంటే ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా, ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా వారి గుండెల మీద ఈ ఇథనాల్ కుంపటిని పెట్టి, అదే అభివృద్ధి అని పాలకులు ప్రచారం చేయదలచుకున్నారు.
ఎన్ డి ఏ ప్రభుత్వం 2021లో ఈ విధానం ప్రకటించగానే దాన్ని వెంటనే తలకెత్తుకుని, అప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న కార్పొరేట్ అనుకూల టి ఎస్ ఐపాస్ విధానంతో కలిపి, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 ఇథనాల్ కర్మాగారాలకు అనుమతులు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానిది. ఆ కర్మాగారాల యజమానులలో పారిశ్రామిక, వ్యాపారవేత్తలు మాత్రమే కాక, రాష్ట్రంలోని, పొరుగు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఉండడం విశేషం. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈ విధానాన్ని రెండేళ్లు నడిపించగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన ఎన్నో విషయాలలో గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినప్పటికీ ఈ విధానాన్ని మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నది.
ఇంత ఘన చరిత్ర ఉన్న ఇథనాల్ కార్ఖానా ప్రమాదాన్ని తప్పించుకున్న మోమిన్ పేట ప్రజలకు అభినందనలు. శుభాకాంక్షలు. ఇతర బాధిత ప్రజలందరూ మోమిన్ పేట దారి ఎంచుకోవాలి.





