2023 తర్వాత అదానీ గ్రూప్‌పై అమెరికాలో లంచం కేసులు, బొగ్గు ధరల పెంపు, పర్యావరణ ఉల్లంఘనలు వంటి అనేక ఆరోపణలు నమోదయ్యాయి. కెన్యా వంటి దేశాలు అవినీతి అనుమానాలతో ఒప్పందాలను రద్దు చేశాయి. భారత నియంత్రణ సంస్థలు రాజకీయ ఒత్తిళ్ల నడుమ స్వతంత్రతను నిలబెట్టుకోవడంలో కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇది మొత్తం భారత ఆర్థిక వ్యవస్థలో రాజకీయ శక్తి మరియు కార్పొరేట్ మూలధనం మధ్య పెరుగుతున్న మేళవింపును ప్రతిబింబిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక సంబంధం భారత రాజకీయ శక్తి మరియు కార్పొరేట్ ప్రభావం మధ్య ఉన్న అనుబంధం మళ్లీ చర్చను రేపుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిని “మోదానీ నెక్సస్” అని పిలుస్తూ, ప్రభుత్వ విధానాలు ప్రైవేట్ వ్యాపార ప్రయోజనాల మధ్య సంబంధాలు గట్టిపడి సామాన్యుల బతుకు బజారుకీడ్చిందని ఆరోపించారు. గత రెండు దశాబ్దాలుగా అదానీ గ్రూప్ విస్తరణతోపాటు, నియంత్రణ సడలింపులు, ఆర్థిక పారదర్శకత, ప్రభుత్వ ప్రాధాన్యత వంటి ప్రశ్నలు నిరంతరం లేవుతున్నాయి. ఈ చర్చను మరింత వేడెక్కించినవి రెండు ప్రధాన పరిణామాలు ఒకటి 2023లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక, ఇది అదానీపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు చేసింది, గత వారంలో ది వాషింగ్టన్ పోస్ట్ వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వ సహకారంతో జరిగిన బిలియన్ల డాలర్ల బైలౌట్. ఇవి రెండూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్థిక శక్తి మరియు రాజకీయ అధికారాల అంతర్గత బంధంపై తీవ్రమైన సందేహాలను రేకెత్తించాయి.
మోదీ –అదానీ బంధం మూలాలు 2000ల ప్రారంభంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాలం నుంచి ఉన్నాయి. ఆ సమయంలో మోదీ అదానీకి చెందిన ముంద్రా పోర్ట్‌కు ఎకరాకు ఒక అమెరికన్ సెంట్ కంటే తక్కువ రేటుకు భూమి కేటాయించబడింది.
2012 ప్రభుత్వ ఆడిట్ ఈ విధానాన్ని విమర్శిస్తూ, పరిశ్రమలకు సబ్సిడీ ఫ్యూయల్ ఇవ్వడం వినియోగదారుల నష్టానికి దారితీసిందని పేర్కొంది. 2014లో మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అదానీ వ్యాపార సామ్రాజ్యం గణనీయంగా విస్తరించింది. అతని ఆస్తులు 230 శాతం పెరిగి 90 బిలియన్ డాలర్లకు చేరాయి. పోర్టులు, విమానాశ్రయాలు, శక్తి రంగాల వంటి కీలక రంగాల్లో అదానీ కంపెనీలు పెద్ద కాంట్రాక్టులు గెలుచుకున్నాయి. 2018లో విమానాశ్రయాల ప్రైవేటీకరణ నిబంధనలు మార్చబడటంతో, విమానయాన అనుభవం తక్కువ ఉన్నప్పటికీ, అదానీ ఆరు ప్రధాన విమానాశ్రయాలపై నియంత్రణ సాధించాడు. కేరళ ఆర్థిక మంత్రి దీన్ని “నిర్లజ్జమైన స్నేహపూర్వక వ్యాపారం”గా అభివర్ణించారు. విపక్ష పార్టీలు ఈ పరిణామాలు యాదృచ్ఛికం కావని, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అదానీ కంపెనీలు బీజేపీకి భారీ విరాళాలు ఇచ్చి, ప్రతిగా విధాన సడలింపులు పొందుతున్నాయని ఆరోపిస్తున్నాయి. 2025 జూన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య – “డబ్బు, విధానం మీది; లాభం, సౌలభ్యం అదానీది” – ఈ ఆరోపణలకు ప్రతీకగా నిలిచింది. బీజేపీ నేతలు ఈ విమర్శలను కొట్టి, అదానీ ఎదుగుదల మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణానికి సంకేతమని చెబుతున్నారు.
మోదీ అదానీ అనుబంధం “క్రోనిజంను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి, మార్కెట్ న్యాయాన్ని ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.” 2023 జనవరిలో అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక, అదానీపై “ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక మోసం” ఆరోపణలు చేసింది. ఈ నివేదికలో షేర్ ధరల మానిప్యులేషన్, తప్పుడు లెక్కలు, మారిషస్ ఆధారిత షెల్ కంపెనీల ద్వారా మార్కెట్ విలువ పెంపు వంటి అంశాలు వెల్లడించబడ్డాయి. ఫలితంగా, అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లు కోల్పోయింది, అలాగే ఎల్ఐసి 5.6 బిలియన్ డాలర్ల నష్టపోయింది . అదానీ దీన్ని “భారతదేశంపై కుతంత్ర దాడి”గా పేర్కొని, వ్యతిరేకంగా 413 పేజీల వివరణ ఇచ్చారు. సెబీ కొన్ని ఆరోపణలను కొట్టివేసినా, విదేశీ పెట్టుబడులపై అనేక అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. గత వారం ది వాషింగ్టన్ పోస్ట్ మరో ప్రకంపన రేపింది.
ఆ నివేదిక ప్రకారం, భారత ప్రభుత్వం ఎల్ఐసి ద్వారా 3.9 బిలియన్ డాలర్ల బైలౌట్ ప్రణాళికను రూపొందించి, అదానీ కంపెనీల బాండ్లు మరియు షేర్లలో పెట్టుబడులు పెట్టించిందని తెలిపింది. అప్పట్లో అదానీ గ్రూప్ అప్పులు పెరుగుతుండగా, ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లను సాకుగా చూపి ఎల్ఐసి నిధులను వినియోగించినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జైరాం రమేష్ దీనిని “మోదానీ మెగా స్కామ్”గా పేర్కొనగా, మల్లికార్జున ఖర్గే ప్రజల బీమా పొదుపులు కార్పొరేట్ రక్షణకు వినియోగించబడ్డాయని విమర్శించారు. ఎల్ఐసి అదానీ కంపెనీలు ఈ ఆరోపణలను “అసత్యం”గా కొట్టి, పెట్టుబడులు వ్యాపారపరమైనవే అని స్పష్టం చేశాయి. అయినప్పటికీ, ఈ ఘటన ప్రభుత్వం పెద్ద వ్యాపార సమూహాలను రక్షిస్తోంది అన్న అభిప్రాయాన్ని బలపరిచింది.
2023 తర్వాత అదానీ గ్రూప్‌పై అమెరికాలో లంచం కేసులు, బొగ్గు ధరల పెంపు, పర్యావరణ ఉల్లంఘనలు వంటి అనేక ఆరోపణలు నమోదయ్యాయి. కెన్యా వంటి దేశాలు అవినీతి అనుమానాలతో ఒప్పందాలను రద్దు చేశాయి. భారత నియంత్రణ సంస్థలు రాజకీయ ఒత్తిళ్ల నడుమ స్వతంత్రతను నిలబెట్టుకోవడంలో కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇది మొత్తం భారత ఆర్థిక వ్యవస్థలో రాజకీయ శక్తి మరియు కార్పొరేట్ మూలధనం మధ్య పెరుగుతున్న మేళవింపును ప్రతిబింబిస్తున్నాయి. పోర్టులు, విద్యుత్, రవాణా వంటి కీలక రంగాల్లో అదానీ గ్రూప్ దేశపు మౌలిక వసతులలో సుమారు ఐదవ వంతు వాటా కలిగి ఉంది. మద్దతుదారుల దృష్టిలో ఇది దేశ ఆత్మనిర్భరతకు ప్రతీక; విమర్శకుల దృష్టిలో ఇది స్నేహపూర్వక పాజీవాదంకి చిహ్నం.
ఈ పరిణామాలు కార్పొరేట్ పాలనకే కాదు, సాధారణ ప్రజలకు కూడా ప్రమాదకర సూచనలు ఇస్తున్నాయి. ఎల్ఐసి , పెన్షన్ నిధులు వంటి ప్రజా సంస్థలు రాజకీయ నిర్ణయాల ప్రభావానికి లోనవుతుండటం, ఆర్థిక వ్యవస్థలో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. మొత్తంగా, మోదీ –అదానీ సంబంధం కేవలం ఇద్దరి వ్యక్తుల గాధ మాత్రమే కాదు; ఇది ఉదయోన్ముఖ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ అధికారాలు ఆర్థిక శ్రేణులను ఎలా మలుస్తాయన్న సందేహం కలుగుతుంది. భారతదేశం వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తూ సంస్థాగత సమగ్రతను కాపాడగలదా అన్న ప్రశ్న ఇప్పటికీ మేధావులను మదుపరులను కలవరపెడుతోంది . దానికి సమాధానం భారత మార్కెట్ల విశ్వసనీయత మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది.
డా. ముచ్చుకోట . సురేష్ బాబు,
9989988912.





