ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా ఆధునికీకరణ

జాతర పూజారుల సంఘం సలహా సూచనలను పాటిస్తాం
మేడారం మాస్టర్‌ ప్లాన్‌పై సమావేశంలో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మేడారం మాస్టర్‌ ప్లాన్‌పై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. మేడారం ఆలయ పరిసరాలను ఆదివాసుల ఆచారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు పూజారుల సలహాలు, సూచనల ఆధారంగా అమలు చేయాలని, అవి ఆదివాసీల విశ్వాసాలను గౌరవించే విధంగా ఉండాలన్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ఎంట్రెన్స్‌, క్యూలైన్ల డిజైన్‌లను సిద్ధం చేసి పూజారుల ఆమోదం తీసుకోవాలన్నారు. గద్దెల ఏర్పాట్లు ఆదివాసీల సంప్రదాయాల ప్రకారం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులు వరుసలో ఉండేలా చూడాలన్నారు. గిరిజన సంక్షేమ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ఆధారంగా డిజైన్‌ రూపొందించాలనీ పేర్కొన్నారు. మేడారం మాస్టర్‌ ప్లాన్‌పై కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కోర్‌ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జాతర పూజారులు, పరిశోధకులు, జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులతో కూడిన కోర్‌ కమిటీ మాస్టర్‌ ప్లాన్‌ అమలును పర్యవేక్షిస్తుందని మంత్రి సీతక్క చెప్పారు. ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి జాతర అయిన మేడారం జాతరకు దేశ విదేశాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, దర్శనం సజావుగా తొందరగా పూర్తి ఆయ్యేలా వున్న అడ్డంకులను తొలగించాలన్నారు. జనవరిలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభానికి ముందు మాస్టర్‌ ప్లాన్‌లోని తొలి దశ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సచివాలయంలో మేడారం మాస్టర్‌ ప్లాన్‌ పై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ వెంకట్రావు, ములుగు కలెక్టర్‌ దివాకర్‌ టిఎస్‌, సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, పూజారి సిద్ధ బోయిన అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛదనం-పచ్చదనంపై సమీక్ష

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మ ంత్రి సీతక్క పిలుపునిచ్చారు. గత ఏడాది 6 కోట్ల 90 లక్షల మొక్కలు నాటినట్టు నివేదించారని, నాటిన ఆ మొక్కల్లో ఎన్ని బతికాయో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈసారి గత ఏడాది లక్ష్యానికి మించి 7 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. నర్సరీలో దాదాపు తొమ్మిది కోట్ల మొక్కలు సిద్ధం చేశామని చెప్పారు. వ్యవసాయానికి అనుబంధంగా మొక్కలు నాటి చెట్లు పెంచే కార్యక్రమానికి ప్రాధాన్యతనివ్వాలని, తాటి, ఈత, పండ్ల మొక్కలను నాటి వాటిని ప్రజలకు ఆదాయంగా మారిస్తే వాళ్లే వాటిని సాదుకుంటారని చెప్పారు. గ్రామస్థాయిలో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని, దోమలు, అంటువ్యాధులు రాకుండా నీటి నిల్వ నివారణకు డ్రైడేను నిర్వహించాలని సూచించారు. ఫాగింగు, బ్లీచింగ్‌ నిత్యం జరగాలని, తాగునీటి ట్యాంకులను పది రోజులకొకసారి శుభ్రం చేయాలని, స్వచ్ఛదనం- పచ్చదనంపై రోజువారీగా నివేదించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటేందుకు ఇప్పటివరకు 50 శాతం గుంతలనే పూర్తి చేశారని, యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని, అధికార్లు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సీతక్క అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *