పలు జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు  

కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
ఈ నెలాఖరులోగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని, దీనితో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున, ఏవిధమైన విపత్తులు జరుగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో మే మాసాంతం వరకే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో జిల్లాలకు ముందస్తు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తగు మార్గదర్శకాలను విడుదల చేశారు..గత 2024 ఆగస్టు మాసంలో వచ్చిన భారీ వర్షాలతో సకాలంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు చేరుకోక పోవడంతో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, ముందస్తుగానే ఈసారి 12 స్టేట్ డిసాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎస్‌డీఆర్ ఎఫ్‌ ) లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఒక్కో టీమ్ లో తెలంగాణా స్పెషల్ పోలీస్ కు చెందిన వంద‌మంది సుశిక్షితులైన పోలీసులు ఉంటారని, ఈ బృందాలను రాష్ట్రంలోకి పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేశామని చెప్పారు.

తద్వారా, ఎక్కడైనా భారీ వర్షాలు, తుఫానులు వచ్చినా, వెంటనే సమీపంలోని ఎస్‌డీఆర్ ఎఫ్  బృందాలు చేరుకుంటాయని కలెక్టర్లకు తెలిపింది. దీనితో పాటు, ఈ సారి 3 ఎన్ డీఆర్ ఎఫ్ బృందాల‌ను హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలు వచ్చే జిల్లాల్లో ఈసారి  అదనపు ఎన్ డీఆర్ ఎఫ్ బృందాల‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఎన్ డీఆర్ ఎఫ్ కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న అన్ని ఫైర్ స్టేషన్లలో ఫైర్ సిబ్బందికి ప్రత్యేకంగా విపత్తుల నివారణ చర్యలపై శిక్షణను ఇప్పించామని అన్నారు. హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాలకు తక్షణమే స్పందించేలా హైడ్రా బృందాలను ఏర్పాటు చేసామ‌న్నారు. తమ జిల్లాలోని వరదలు, వర్షాల వల్లముంపు ప్రాంతాలు, ఇతర సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *