ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్‌

-‌బస్‌ ‌భవన్‌ ఎదుట బిఆర్‌ఎస్‌వి మెరుపు ధర్నా
– బస్‌ ‌పాస్‌ ‌ధరల పెంపుపై నిరసన
– బస్‌ ‌భవన్‌ ‌ముట్టడికి యత్నం
– రోడ్డుపై బైఠాయింపు

‌తెలంగాణ జాగృతి నేత, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. పెంచిన బస్‌ ‌పాస్‌ ‌ధరలను వెంటనే తగ్గించాలంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి మంగళవారం బస్‌ ‌భవన్‌ను ముట్టడించేందుకు కవిత ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌ ‌స్తంభించింది. ఈ మేరకు కవిత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కవిత ధర్నాతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో  ఆమెను పోలీసులు అరెస్ట్ ‌చేసి చంద్రాయణగుట్ట పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ప్రజలను రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంటోందని.. విద్యార్థులు, ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా కవిత ఆవేదన వ్యక్తం చేశారు.  చంద్రాయణ గుట్ట పోలీస్‌ ‌స్టేషన్‌కు కవితను తరలించడంతో జాగృతి కార్యకర్తలు సైతం భారీగా పోలీస్‌ ‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అన్ని రకాల బస్‌ ‌పాస్‌ ‌ఛార్జీలను టీజీఎస్‌ఆర్టీసీ పెంచింది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌తోపాటు- మెట్రో డీలక్స్ ‌ఛార్జీలనూ పెంచేసింది. మరోవైపు పెంచిన బస్‌ ‌పాస్‌ ‌చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ ‌చేస్తూ బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్‌ ‌భవన్‌ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు. ధర్నాకు దిగిన అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ఉపాధ్యక్షుడు పడాల సతీష్‌, ‌కడారి స్వామి యాదవ్‌తో పాటు- బీఆర్‌ఎస్వీ శ్రేణులను, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సు పాస్‌ ‌ఛార్జీలు పెంచడం వల్ల పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది.

ఒక్కో విద్యార్థిపై రూ. 250 నుంచి రూ. 350 వరకు భారం పడుతోంది. కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థులపై ఈ విధమైన భారం ఏదీ విధించలేదు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి, ఒకవైపు బస్సులను పెంచక విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ.. మరోవైపు చార్జీలు పెంచి విద్యార్థులపై రేవంత్‌ ‌సర్కార్‌ ఆర్ధిక భారాన్ని మోపుతున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెంచిన బస్సు చార్జీలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నామని పేర్కొన్నారు. దాదాపు 20 శాతం మేర ఛార్జీలను పెంచడంతో హైదరాబాద్‌ ‌నగర వాసులపై అధిక భారం పడనుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  అయితే ఈ బస్‌ ‌పాస్‌ ‌ఛార్జీల పెంపుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇప్పటికే స్పందించారు. బస్‌ ‌పాస్‌ ‌ఛార్జీలు పెంచి చాలా కాలమైందని.. ఈ నేపథ్యంలో వాటిని పెంచాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. బస్‌ ‌ఛార్జీల పెంపు నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందంటూ ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్స్‌లోని బస్‌ ‌భవన్‌ను ముట్టడించేందుకు యత్నించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *