గాంధీగిరీకి కొత్త భాష్యం

– కాలానుగుణంగా పంథాలో మార్పు
– కొత్త‌గా వుంటేనే సంస్థ‌ల‌కు మ‌నుగ‌డ‌
– లీడ‌ర్‌గా ఎద‌గాల‌నుకుంటే జాగృతి అండ‌
– శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ క‌విత‌
హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై26: కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథా ను మార్చుకుందని జాగృతి ఆధ్వర్యంలో నిర్వ  హించిన ‘లీడర్‌’ ‌శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నట్లు చెప్పారు.తెలంగాణ జాగృతి నుంచి గాంధీగిరీకి కొత్త భాష్యం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మన సంప్రదాయాలు, కట్టుబాట్లపై అవగాహన కల్పించుకోవడమే లీడర్‌ ‌కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొంపల్లి శ్రీ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న లీడర్‌ ‌శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. జాగృతి కార్యకర్తలకు మానవీయ, సామాజిక బాధ్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అలాగే నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో ఆమె వివరంగా తెలిపారు. ఎప్పుడూ కొత్తగా ఉంటేనే  సంస్థలు బతుకుతాయి. తల్లి గర్భంలో నుంచి ఎవరూ నాయకత్వ లక్షణాలతో పుట్టరు. నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందు కెళ్లేవాడే నాయకుడవుతాడు తప్ప మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాలేడని అన్నారు. సామాజిక స్పృహ  కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 11 స్థానంలో ఉందని ఓ సర్వేలో తేలింది. తోటివారి గోప్యతకు, మర్యాదకు భంగం వాటిల్లకుండా పదునైన విమర్శలు చేయడం నేర్చుకోండి. పక్కవాడిని తిడుతున్నారంటే కంటెంట్‌ ‌లేనట్లు అర్థం. మహాత్మాగాంధీ ఎప్పుడూ ఎమ్మెల్యే గానో, ఎంపీగానో లేరు. కానీ, ఇప్పటికీ ఆయన్ని గుర్తు చేసుకుంటాం. సాంస్కృతిక నేపథ్యం లేకుండా ఏ జాతీ మనుగడ సాధించలేదు. సాంస్కృతిక నేపథ్యం లేని జాతి.. పునాది లేకుండా కట్టిన బిల్డింగ్‌ ‌లాంటిది. తెలంగాణ జాతికి అద్భుతమైన నేపథ్యం ఉంది. దానిని పరిరక్షించేందుకే  ‘జాగృతి’ పని చేస్తుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో యాసను అవహేళన చేసిన ఓ వ్యక్తికి నంది అవార్డు ఇవ్వడాన్ని నిరసించిన ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి అని గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యక్తులైనా, ఎంత పెద్ద సమస్య అయినా ఎదురొడ్డి నిలిచిన సంస్థ ఇది. తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం పని చేశాం. వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి కోసం పని చేశాం. రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరకోబోదని కవిత అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యవస్థతోనైనా, ఎంతటి పెట్టుబడి వ్యవస్థతోనైనా జాగృతి నిలబడి పోరాడిందని కవిత పేర్కొన్నారు. ఇది కేవలం ఒక సంస్థ మాత్రమే కాక, ఒక ఉద్యమంగా ప్రజలలో పెంపొందించాలన్న ల‌క్ష్యంతో ముందుకు సాగుతోందని చెప్పారు. అలాగే, నాయకత్వం అంటే హోదా కాదు.. ప్రజా స్పృహ‌ అని పేర్కొన్నారు. ఇంట్లో ఉండే ఇల్లాలు మొదటి లీడర్‌.. అని మహిళలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. అదే విధంగా, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని.పరిష్కార మార్గాలు అన్వేషించే వాడే నిజమైన నాయకుడని ఆమె అభిప్రాయపడ్డారు. సామాజిక స్పృహే మంచి నాయకుడి ప్రథమ లక్షణమని కవిత అన్నారు. మన ఇంట్లో ఉన్న చెత్తను పక్కింట్లో వేయకుండా చూసుకోవడమే సామాజిక స్పృహే అంటూ ఉదాహరణతో వివరించారు. జాగృతి కార్యకర్తలు ఈ స్పృహ‌తో సేవా మార్గంలో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. బయట కొన్ని విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, జాగృతి కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. అశ్లీల‌ ‌భాషను వాడకుండా, విషయపరమైన పదునైన సమాధానాలు ఇవ్వగలిగినవారే నిజమైన నేతలు అవుతారని వివరించారు. మహాత్మా గాంధీ చెప్పిన అహింసా సిద్ధాంతాన్ని పాటించాలనీ, ధైర్యానికి ఉదాహరణగా సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌ని మనసులో ఉంచుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఏ ప్రయోజనాల కోసం కాదని, కేవలం సమాజానికి మంచి నాయకత్వం అందించాలనే దృష్టితోనే జరుపుతున్నామని ఆమె స్పష్టం చేశారు. ఎవరైనా నాయకత్వం వ‌హించే ఉత్సాహ‌ముంటే, జాగృతి వాళ్ల వెంట నిలుస్తుందని స్పష్టం చేశారు. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల మహిళలు, యువత రాజకీయంగా ఎదగడానికి జాగృతి ఒక గొప్ప వేదికగా మారుతుందని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *