– జాతీయస్థాయి వోట్ చోరీ కంటే తీవ్రమైన నేరం
-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల ‘చోరీ’పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడకపోవడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న వోట్ చోరీ కంటే దారుణమైన నేరం అని, ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి అంటూ ఆయనపై ధ్వజమెత్తారు. ఇక్కడి ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ అవలంబిస్తున్నది ద్వంద్వ ప్రమాణాలని విరుచుకుపడ్డారు. ఇలాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియలో భాగస్వామి అయినందుకు రాహుల్ గాంధీ సిగ్గుపడాలన్నారు. బీఆర్‌ఎస్ టికెట్లపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తాము పార్టీ మారలేదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేను రాహుల్ గాంధీ సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిసి వారితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని గుర్తు చేశారు. ఇవ్వాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా అంటూ ఆ ఫోటోలను చూపిస్తూ కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్‌లో చేరలేదు అని చెప్పడంపై అది కాంగ్రెస్ కండువా కాదని అంటున్నారు,. మీరు దీన్ని ఒప్పుకుంటారా అని రాహుల్ గాంధీని నిలదీశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





