– కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడ లేదని, తానేంటో ప్రజలకు తెలుసునని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. తాను కబ్జాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐడీపీఎల్ భూముల కబ్జాపై తనపై ఇద్దరు నేతలు అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆ భూముల్లో నివాసం ఉంటున్న పేదల జోలికి వెళ్తే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు. ఆ భూముల్లో గజం జాగా కబ్జా చేశానని నిరూపిస్తే తాను జైలుకెళ్లేందుకు సిద్దమని చెప్పారు. రూ. 4 వేల కోట్ల విలువైన భూ వివాదంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే కోరారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాకు పాల్పడుతున్నారని తాను గతంలోనే చాలాసార్లు ఫిర్యాదు చేశానని ఆయన గుర్తు చేశారు. అక్కడ స్థానికంగా ఉంటున్న ఇంద్రనగర్ 70 ఏళ్ల క్రితం ఏర్పడిందని తెలిపారు. అక్కడి ప్రజల కోసం డ్రైనేజీ, రహదారుల సౌకర్యం కల్పించాలంటూ జీహెచ్‌ఎంసీ నుంచి గతంలో నిధులు తీసుకొచ్చానని వివరించారు. అయితే ఐడిపిఎల్ ఉద్యోగులను తాను బెదిరించాననేది పూర్తిగా అవాస్తవమని ప్రకటించారు. ఈ ఆరోపణలను తాను ఖండిస్తున్నానన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత కృష్ణారావుపై ఆరోపణలు చేశారు. దినిపై ఎమ్మెల్యే కృష్ణారావు కాస్త ఘాటుగా స్పందించారు. దాంతో ఆయనపై జాగృతి నేతలతోపాటు అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. ఆధారాలతో అన్ని విషయాలు బయటపెడతానంటూ కవిత స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.