రైతు బీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం దుర్మార్గం

  • పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో చక్కర్లు
  • మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : ఏ కారణంతో అయినా, రైతు మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు (MLA Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిబ్రవరి నెలలోనే చెల్లించాల్సిన రూ. 775 కోట్ల ప్రీమియం మూడు నెలలుగా ప్రభుత్వం చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతు కుటుంబాలకు శాపంగా మారుతున్నదని, అసలు రాష్ట్రంలో రైతు బీమా పథకం కొనసాగుతున్నదా?లేదా అటకెక్కించారా అనే అనుమానం కలుగుతోందన్నారు.

వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు, యాసంగి పైసలు ఎప్పుడు ఇస్తారు. అని మేము అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు.. మార్చి 31 లోగా మొత్తం చెల్లిస్తామని చెప్పి మాట తప్పారని, మొత్తంగా రైతు బంధు పథకాన్ని ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. రుణమాఫీ హామీ విషయంలో మేము వెంటబడితే దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పారు. సగం మందికి కూడా రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురుపోసుకున్నారు. ఇప్పుడు రైతు కుటుంబాలకు ధీమా ఇచ్చే రైతు బీమా పథకాన్ని లేకుండా చేస్తున్నారని, ఇంతకంటే అమానుషం ఏమైనా ఉంటదా? ఇది కచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని హరీష్ రావు మండిపడ్డారు. పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి, మంత్రులకు రైతు కుటుంబాల కన్నీళ్లు కనిపించడం లేదా?అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *